logo

ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత ఎన్టీఆర్‌దే: నామా

నాడు కాంగ్రెస్‌ పాలనలో ఆకలి చావులు ఉండేవని, వాటిని అరికట్టేందుకు అన్న ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించారని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.

Published : 05 May 2024 02:26 IST

ఖమ్మంలో మాట్లాడుతున్న భారాస అభ్యర్థి నామా, చిత్రంలో తెదేపా నేతలు  

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: నాడు కాంగ్రెస్‌ పాలనలో ఆకలి చావులు ఉండేవని, వాటిని అరికట్టేందుకు అన్న ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించారని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. సంక్షేమ రాజ్యానికి ఆద్యుడిగా కీర్తి గడించారని కొనియాడారు. ఖమ్మం ఎన్టీఆర్‌ భవన్‌కు శనివారం వచ్చిన నామాకు తెదేపా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం నామాను సన్మానించారు. నామా మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటులో తన పాత్ర ఎంతో ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రామనాథం మాట్లాడుతూ పార్టీ అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలిపారు. చెన్నయ్య, కరుణాకర్‌, విజయ్‌, గుత్తా సీతయ్య, మురళి, రంజిత్‌, మందపల్లి రజిని, మేకల సత్యవతి పాల్గొన్నారు. భారాస అధినేత కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఏపీ సీఎం జగన్‌రెడ్డితో అంటకాగుతూ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. అలాంటి వారికి ఎలా మద్దతిస్తామని టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వాసిరెడ్డి భాస్కర్‌రావు నిరసన తెలిపారు. భారాస నాయకులను తెదేపా కార్యాలయంలోకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.

ఆప్‌ మద్దతు కోరిన నామా.. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లి తనకు మద్దతివ్వాలని కోరారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించటం అన్యాయమన్నారు. ఆప్‌ తెలంగాణ కోర్‌ కమిటీ సభ్యుడు నల్లమోతు తిరుమలరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.


మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌: అజయ్‌

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.  బల్లేపల్లి,  బొడ్డురాయికూడలి, ఎస్సీకాలనీల్లో ప్రచారం నిర్వహించారు. 14 ఏళ్ల పాటు నిర్విరామ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు.   బచ్చు విజయ్‌కుమార్‌, నాగండ్ల కోటేశ్వరరావు, కొనకంచి ప్రసాద్‌ పాల్గొన్నారు.

త్రీటౌన్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లకు భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. భారాస నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని