logo

బాలికలే సాధకులు

తల్లిదండ్రులు బాలురతో సమానంగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాలికలున్నా వేసవి సెలవుల్లో వారిని వెన్నుతట్టి నడిపిస్తున్నారు.

Updated : 06 May 2024 06:02 IST

జాతీయ స్థాయిలో రాణించి స్ఫూర్తిగా నిలిచిన అథ్లెట్లు, మైథిలి, మనుశ్రీ, బిందు వైశాలి

తల్లిదండ్రులు బాలురతో సమానంగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాలికలున్నా వేసవి సెలవుల్లో వారిని వెన్నుతట్టి నడిపిస్తున్నారు. ఈ మార్పును చూడాలనుకునే వారు ఖమ్మం సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ స్టేడియానికి రావాల్సిందే. అథ్లెటిక్స్‌, ఈత, వాలీబాల్‌, జిమ్నాస్టిక్స్‌, స్కేటింగ్‌, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, లాన్‌ టెన్నిస్‌ ఇలా ఒకటేమిటి ఎక్కడ లెక్కేసినా బాలికలే అధికంగా కనిపిస్తున్నారు. టేబుల్‌ టెన్నిస్‌, జిమ్నాస్టిక్స్‌, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, వూషు, స్కేటింగ్‌ అంశాల్లో ఇప్పటికే జాతీయ పతకాల పోటీల్లో రాణించి, అక్కడ పతకాలు సాధించిన క్రీడాకారిణులున్నారు. వారి స్ఫూర్తితో బాలికల సంఖ్య పెరిగిందని సీనియర్‌ క్రీడాకారులు చెప్పారు. ఇక శిక్షకులు కూడా వీరికే పెద్దపీట వేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. బాలికలు ఉదయం, సాయంత్రం, క్రమం తప్పకుండా వస్తున్నారు. వచ్చిన వారు ఏదీ, ఎంత చెబితే అంత వరకు పట్టుదలగా సాధన చేస్తున్నారు. అందుకే బాలికల విభాగంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని శిక్షకులు వివరిస్తున్నారు. ఇక కొందరు బాలురు కొత్తలో తల్లిదండ్రులు కోరిక మేరకు వస్తున్నారు. మధ్యలో మానేస్తున్నారు. చాలా వరకు ఉదయం, సాయంత్రం ఏదో ఓ పూట హాజరవుతున్నారు. ‘క్రీడాకారులను తీర్చిదిద్దితే మాకు పేరొస్తుంది. ఆ పేరు రావాలంటే క్రమశిక్షణతో క్రమం తప్పకుండా వచ్చే పిల్లలు కావాలి.. అలా చూసుకుంటే బాలికలే ముందుంటున్నారు. అందుకే వారిపై శ్రద్ధ పెడుతున్నాం. వారి ప్రతిభా పాటవాలు చూసి ఇంకొందరు బాలికలు వస్తున్నారని’ సీనియర్‌ శిక్షకులు అభిప్రాయపడ్డారు.

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని