logo

పచ్చడి మామిడి మరింత ప్రియం

ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్‌లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది.

Published : 18 May 2024 03:07 IST

మధిర, న్యూస్‌టుడే

మామిడికాయ ముక్కలు కొడుతున్న వ్యాపారి

ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్‌లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. ఈ ఏడాది మామిడికాయ ధరలు మూడింతలు పెరిగాయి. నూనె, ఇతర ముడిసరకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో పచ్చడి తయారీ సామాన్యులకు మరింత భారంగా మారింది.

ధరలు పెరిగాయి ఇలా..

ఏటా పచ్చడి మామిడికాయలు కిలో రూ.40-60 పలికేవి. ఈ ఏడాది ఏకంగా కిలో కాయల ధర రూ.130 నుంచి రూ.150కు పెరిగింది. పప్పునూనె కిలో ప్యాకెట్‌ ధర రూ.400 నుంచి రూ.420కు ఎగబాకింది. వేరుసెనగ నూనె కిలో రూ.140 నుంచి రూ.160కు పెరిగింది. వెల్లుల్లి సైతం కిలో ధర ప్రస్తుతం మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.260 నుంచి రూ.320 వరకు, ఎండు మిరపకాయలు కిలో రూ.350 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం రెండున్నర కిలోల పచ్చడి తయారీకి రూ.325 ఖర్చు అవుతుంది.

ఈ రకాలకు డిమాండ్‌

సాధారణంగా ప్రతి వేసవిలో ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ చివరి వరకు మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. చిన్నరసం, తెల్లగులాబీ, జలాలు, నాటు రసాలు, నాటు మామిడికాయలు, మల్లెకలు వంటి రకాలను వినియోగిస్తారు. ప్రస్తుతం తెల్లగులాబీ, జలాలు, నాటురకాలు, మల్లికలు అందుబాటులో ఉన్నాయి. ఇవి జూన్‌ వరకు లభిస్తాయి. తర్వాత కృష్ణా జిల్లా నుంచి తీసుకొస్తారు. మార్కెట్లో కిలో రూ.150 వరకు ధర పలుకుతున్నాయి. ముక్కలు చేసినందుకు కిలో రూ.20 తీసుకుంటారు. ఎండుమిరపకాయల ధరలు కిలో రూ.350 వరకు ఉన్నాయి.


పచ్చడి పెట్టడం అత్త నేర్పించారు..

మల్లు నందిని

ఆవకాయ పచ్చడిని మహాలక్ష్మి, అన్నపూర్ణగా భావిస్తాం. తయారీ విధానాన్ని అత్త మాణిక్యమ్మ నుంచి నేర్చుకున్నా. ఏటా ఎక్కువ మోతాదులో తయారు చేసి బంధువులు, స్నేహితులకు అందజేస్తా. ఏడాది పొడవునా ఈ మా ఇంట్లో వినియోగిస్తాం. నా భర్త, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇద్దరు కుమారులకు ఆవకాయ పచ్చడి అంటే ఎంతో ఇష్టం.


ఖర్చులు బాగా పెరిగాయి

టి.రమాదేవి, గృహిణి, మధిర

ఈ ఏడాది మామిడికాయల ధర మూడు రెట్లు పెంచారు. నూనె, వెల్లుల్లి ధరలు పెరిగాయి. ఇది సామాన్యులకు కొంత భారంగా మారింది. నాణ్యమైన సరకులతో ఇంటివద్ద తయారు చేసే పచ్చడి రుచి, శుచిగా ఉంటుంది. అన్ని వర్గాల వారు ఆవకాయ పచ్చడిని అమిత ఇష్టంగా భావించి వినియోగిస్తారు. అలాంటి పచ్చడి తయారీకి ఈ ఏడాది ఖర్చులు అదనంగా అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని