logo

వాడి తగ్గని దండా

ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానం కాదని, ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్ట్‌, లెనినిస్ట్‌)(యూసీసీఆర్‌ఐ-ఎంఎల్‌) ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి దండా లింగయ్య.

Updated : 06 May 2024 05:58 IST

ఎన్నికల్లో ఆరోసారి బరిలో లింగయ్య

దండా లింగయ్య

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానం కాదని, ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్ట్‌, లెనినిస్ట్‌)(యూసీసీఆర్‌ఐ-ఎంఎల్‌) ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి దండా లింగయ్య. ఇప్పటి వరకు ఆయన మూడుసార్లు అసెంబ్లీ, రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. రద్దయిన సుజాతనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1994, 1998(ఉప ఎన్నిక), 1998 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1991, గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు ఇక్కడ మూడోసారి బరిలో దిగారు. ఇప్పటివరకు మొత్తం ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినప్పటికీ పార్టీ తమ అభ్యర్థిని బరిలో నిలపడం విశేషం.

నాలుగు దశాబ్దాల ప్రజా పోరాటం...

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవిమద్దులపల్లిలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన లింగయ్య 1975లో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించటంతో ప్రభుత్వం పార్టీపై నిషేధం విధించింది. దీంతో కేంద్ర నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్‌) జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ఇండో, చైనా ఫ్రెండ్‌షిప్‌ అసోసియేషన్‌ రాష్ట్ర, జాతీయ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. యూసీసీఆర్‌ఐ(ఎంఎల్‌) జిల్లా కమిటీ సభ్యుడిగా నాలుగు దశాబ్దాల నుంచి నిత్యం ప్రజా పోరాటాల్లో పాల్గొంటున్నారు. అడవిమద్దులపల్లి సహా జిల్లాలోని పలు ప్రాంతంలో పేదలకు వేలాది ఎకరాల్లో పోడు భూములు సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

దండా లింగయ్య మాట్లాడుతూ...

వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేయడంతోపాటు విప్లవోద్యమాన్ని నిర్మించాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రజలను ఆ వైపు మళ్లించేందుకు, వారిని చైతన్యం చేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేశారని వివరించారు. ప్రజా సమస్యలను వివరిస్తూ 10 లక్షల కరపత్రాలను పంపిణీ చేశామని, పెద్దగా ప్రాబల్యం లేని భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో మంచి ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని