logo

సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

Published : 06 May 2024 01:58 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల నామపత్రాల సమర్పణ, ఉపసంహరణ క్రతువు ముగియటంతో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఇప్పటికే శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను అధికారులు కేటాయించారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో అభ్యర్థులు అధిక సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా ఈవీఎంలను తెప్పించారు. వీటినీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎఫ్‌ఎల్‌సీ(మొదటి దశ తనిఖీ)తో పాటు తొలి, రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. మరోవైపు పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మపరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తిచేసిన అధికారులు ఈనెల 13న జరిగే పోలింగ్‌కు సమాయత్తమవుతున్నారు.

అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

‘ఖమ్మం’లో మూడు, ‘మహబూబాబాద్‌’కు రెండు బ్యాలెట్‌ యూనిట్లు

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి 35 మంది, మహబూబాబాద్‌ స్థానానికి 23 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో నోటాతో కలిపి గరిష్ఠంగా 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. ఈలెక్కన ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రానికి మూడు బ్యాలెట్‌ యూనిట్లు, మహబూబాబాద్‌కు రెండు బ్యాలెట్‌ యూనిట్లు కావాలి. వీటితో పాటు ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక్కో కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ అవసరం. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే అధికారులు కొన్ని ఈవీఎంలను సిద్ధం చేసి మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను ముగించారు. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా ఖమ్మం జిల్లాకు 2,200, భద్రాద్రి జిల్లాకు 1,700 బ్యాలెట్‌ యూనిట్లను అదనంగా  కేటాయించారు. పోలింగ్‌ రోజు సాంకేతిక సమస్యలు తలెత్తినా అంతరాయం కలగకుండా 25 శాతం బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, 40 శాతం వీవీప్యాట్లను అదనంగా అందుబాటులో ఉంచారు.

సాంకేతిక నిపుణుల నియామకం

పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం కలగకుండా అధికారులు శాసనసభ నియోజకవర్గాల వారీగా అదనపు ఈవీఎంలను కేటాయించారు. వీటిని పోలింగ్‌ రోజు ఆయా సెగ్మెంట్లలో విధులు నిర్వర్తించే సెక్టోరల్‌ అధికారులకు అప్పగించనున్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే వేరే వాటిని సెక్టోరల్‌ అధికారులు అమర్చుతారు. ఇలా ఒక్కో   సెక్టోరల్‌ అధికారికి 2-3 ఈవీఎంలను అధికారులు అప్పగిస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున సాంకేతిక నిపుణులను ఈసీ నియమించింది. ఈవీఎంలలో  సమస్యలు తలెత్తితే సాంకేతిక నిపుణులు వెంటనే  సరిచేస్తారు.   వినియోగానికి వీలు పడకుంటే వేరే ఈవీఎం అమర్చుతారు.

ముగిసిన రెండో విడత ర్యాండమైజేషన్‌

ఇప్పటికే మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తైన ఈవీఎంలను అదనంగా అవసరమైన ఈవీఎంలకు కలిపి రెండో విడత ర్యాండమైజేషన్‌ ముగించిన అధికారులు వాటిని పటిష్ఠ భద్రత మధ్య శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. పోలింగ్‌ కంటే ముందు మూడో విడత  ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల జాబితా ప్రకారం ఇటీవల బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించారు. ప్రస్తుతం ఈ పేపర్‌ను బ్యాలెట్‌ యూనిట్లలో పొందుపరుస్తున్నారు.

మధిరలో ఈవీఎంల కమిషనింగ్‌

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: ఖాజీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈవీఎంల కమిషనింగ్‌ను కలెక్టర్‌ గౌతమ్‌ ఆదివారం చేపట్టారు. ఈవీఎం పరికరాల సన్నద్ధతను పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన గదులను తనిఖీ చేశారు.  పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ నమోదు  వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ గణేశ్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, సీఐ మధు, గ్రామీణ ఎస్సై లక్ష్మీభార్గవి, గిర్దావర్‌ జయకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆత్కూరు సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద కలెక్టర్‌ గౌతమ్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని