logo
Published : 04 Dec 2021 04:45 IST

కౌలు మడిలో కన్నీటి సుడులు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు రైతులను కోలుకోకుండా చేశాయి. కౌలు కర్షకుల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. కౌలు ధరలతోపాటు, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. దిగుబడులు చేతికొచ్చిన సమయంలో అధిక వర్షాలతో పంట నీటమునిగి అప్పులపాలు చేసింది. గతేడాది నష్టాలు మూటగట్టుకొన్న కౌలు రైతులకు ఈ ఏడాది అధిక వర్షం కోలుకోలేని దెబ్బతీశాయి. కల్లాల్లోని మొక్కజొన్న మొలకెత్తగా, వరి ధాన్యం రంగు మారింది. మిరప తడిసి ముద్దై నష్టం మిగిల్చింది. జిల్లాలో 7.31 లక్షల మంది రైతులున్నారు. ఇందులో కౌలు రైతులు 80వేల వరకు ఉన్నారు. కౌలు రైతుల దైన్యస్థితిపై ‘ఈనాడు-ఈటీవీ’ కథనం!

వరదముంచింది

వరద నీటిలో మునిగిన వరి పొలం కౌతాళం మండలం మరలికి చెందిన కౌలు రైతు హరిజన జొల్లప్పది. ఎకరా రూ.10వేల చొప్పున కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పెట్టుబడి ఎకరాకు రూ.26వేల వరకు వచ్చింది. ఇటీవల కురిసిన వర్షంతో వరద నీటిలో పంట మునిగింది. చేతికొచ్చిన పంట నోటికి కాకుండా పోయిందని ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. - కౌతాళం, న్యూస్‌టుడే

రుణం దక్కదు.. గుర్తింపు కార్డులివ్వరు

F 2019 నుంచి ఇప్పటి వరకు 50,110 సీసీఆర్సీ (కౌలు రైతు) కార్డులు అందజేశారు. 11 నెలల కాలవ్యవధితో ఇచ్చే సీసీఆర్సీ కార్డులు కలిగిన ఐదువేల మందికే పెట్టుబడి సాయం అందింది. ఈ ఏడాది కేవలం 833 మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసి చేతులుదులుపుకొన్నారు.

F కౌలుకు ఇచ్చినప్పటికీ భూ యజమానే రైతు భరోసా... పెట్టుబడి సాయం, పంట నష్ట పరిహారం తీసుకొంటున్నారు. కౌలు రైతుకు పరిహారం కంటి తుడుపుగా మారింది.

F రుణ ప్రణాళికలు అటకెక్కాయి. ఖరీఫ్‌లో కౌలు రైతులకు రూ.151 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం నిర్దేశించారు. కేవలం రూ.5.03 కోట్లు 1693 మందికి ఇచ్చారు. చేసేదిలేక వందల మంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. రబీలో కౌలు రైతుల రుణ ప్రణాళికే జరగకపోవడం గమనార్హం.

ఉల్లి కుళ్లింది

కుళ్లిన కాయలు చూపుతున్న రైతు గోనెగండ్లకు చెందిన బుడ్డప్ఫ నాలుగెకరాలు రూ.1.20 లక్షలకు కౌలుకు తీసుకొని ఉల్లి సాగు చేశారు. సొంత పొలం రెండెకరాలు కలిపి మొత్తం ఆరు ఎకరాల్లో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టారు. పంట కాలం రెండు నెలలు దాటింది.. అధిక వర్షాల వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదు.. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకొనేందుకు అదనంగా ఖర్చు చేసి మందులు పిచికారీ చేసినట్లు ఆయన తెలిపారు. పంట ఎదుగుదల లేదు.. కొంత వరకు కుళ్లి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. - గోనెగండ్ల, న్యూస్‌టుడే

వరి వంగింది

మంత్రాలయం మండలం చెట్నేపల్లికి చెందిన విఠల్‌బాబు 65 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. ఎకరాకు రూ.25-30వేలు పెట్టుబడి పెట్టారు. 35 ఎకరాల్లో వరి కోత కోశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నీట మునిగింది. ఆ ధాన్యం ఆరబెట్టడానికి, మొలకలు గ్రేడింగ్‌ చేయడానికి రెండు వారాల్లో రూ.45వేలు ఖర్చు చేశారు. మిగిలిన పంట పూర్తిగా నేలమట్టం కావడంతో కోత కోసేందుకు వీలుకాని పరిస్థితి. రూ.8 లక్షలపైగా నష్టం వాటిల్లింది.. కౌలు నగదు బదులు ఎకరాకు పది బస్తాలు ఇచ్చేలా భూ యజమానితో ఒప్పందం చేసుకున్నా.. పరిహారం ఇచ్చి ఆదుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. - మంత్రాలయం-న్యూస్‌టుడే

గతనెలలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలు

నష్టం: రూ.300-400 కోట్లు

వరి: 60,707 ఎకరాలు

శనగ: 2.13లక్షల ఎకరాలు

ఉద్యాన పంటలు: 3వేల హెక్టార్లు

నష్టపోయిన రైతులు: 1,28,111

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని