ప్రచార జోరు.. వ్యూహాలకు పదును

ఎన్నికల కోడ్‌ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం

Updated : 09 May 2024 06:47 IST

ఈటీవీ, ఖమ్మం, ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: ఎన్నికల కోడ్‌ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు పల్లెలకు చేరుతోంది. పోలింగ్‌ సమయం ముంచుకొస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంటోంది. కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

ముగిసిన అగ్రనేతల పర్యటనలు

 ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్‌షోలు దాదాపు ముగిసినట్టే. కొత్తగూడెం, మణుగూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. భారాస చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోల్లో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. కొత్తగూడెం, మహబూబాబాద్‌లో భాజపా బహిరంగ సభలకు ఆపార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

 స్థానిక నాయకులు అన్నీ తామై..

మూడు రోజుల్లో ప్రచార ఘట్టం ముగియనుంది. ఇంత తక్కువ వ్యవధిలో లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించడం సాధ్యం కాదని అభ్యర్థులే చెబుతున్నారు. అందుకే వారి అనుచరులు, పార్టీ ముఖ్యనాయకులు, బంధువులు ఎక్కడికక్కడ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుంటున్నారు.  ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగ సభలు, కార్నర్‌ సమావేశాలు, ర్యాలీలకు ప్రాధాన్యమిస్తుంటే ఆయా పార్టీల స్థానిక నాయకులు ఇంటింటికీ వెళ్లి  ఓటర్లను కలుస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా బహిరంగ సభలకు హాజరుకాని ప్రజల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార వాహనాలకు మైకులు పెట్టి అగ్రనేతల ప్రసంగాలు వినిపిస్తున్నారు.

పదవుల ఆశ చూపుతూ..

ఇప్పుడు మద్దతుగా నిలిస్తే.. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవులు కట్టబెట్టేందుకు సహకరిస్తామని గ్రామస్థాయి నాయకులకు ఆయా పార్టీల ముఖ్యనేతలు హామీ ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇదేమాదిరిగా తమ బుట్టల్లో వేసుకుంటున్నారు.

వనరులను సమకూర్చుకుంటూ..

రోజు వారీగా ప్రచారం ముగిశాక రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ముఖ్యులతో అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటుబ్యాంకును పదిలపరుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. వార్డులు, గ్రామాల్లో ప్రభావం చూపే నాయకులు, యువకులను లక్ష్యంగా చేసుకొని తమకు సహకరించాలని వర్తమానం పంపుతున్నారు. పోలింగ్‌కు ముందు రెండు రోజుల పాటు ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీకి కావాల్సిన వనరులను సమకూర్చుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని