logo

జగన్‌కో దండం.. వచ్చారంటే గండం

సారొస్తున్నారంటే.. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాల్సిందే. అత్యవసరమైనా.. ఆపదలో ఉన్నా.. అవస్థలు పడుతున్నా.. సామాన్య ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆయనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు.

Updated : 31 Mar 2024 08:01 IST

సీఎం పర్యటించే దారుల్లో వాహనాల అడ్డగింత

తుగ్గలి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆగిపోయిన వందలాది వాహనాలు

పత్తికొండ, తుగ్గలి, న్యూస్‌టుడే: సారొస్తున్నారంటే.. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాల్సిందే. అత్యవసరమైనా.. ఆపదలో ఉన్నా.. అవస్థలు పడుతున్నా.. సామాన్య ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆయనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయినా.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినా.. అవేమీ పట్టించుకోరు. ఇదీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో తరచూ ఎదురయ్యే పరిస్థితి. ఎమ్మిగనూరు సభ ముగించుకుని పత్తికొండ చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు తుగ్గలి వద్ద ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ముఖాముఖికి సీఎం పది గంటలకు రావాల్సి ఉండగా 12 గంటలకు చేరుకున్నారు. తుగ్గలి- మద్దికెర, తుగ్గలి- పత్తికొండ, తుగ్గలి- గుత్తి మార్గాల్లో వందలాదిగా తరలివచ్చిన పోలీసులు నాలుగు గంటల పాటు వాహనాలను నిలిపివేశారు. మండే ఎండలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు, దూరం వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతూ.. అసహనం వ్యక్తం చేశారు.

వాహనాలను ఆపేస్తున్న పోలీసులు

చుట్టూ 20 కి.మీ. పోలీసులే

పరదాల నుంచి ప్రజల్లోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఆయన నిర్వహించే సభ చుట్టూ 20 కి.మీ. దూరం మేర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పత్తికొండ, తుగ్గలి పర్యటన దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నుంచే మద్దికెర వద్ద పోలీసులు పికెట్‌ నిర్వహించారు. జిల్లా సరిహద్దు బసినేపల్లి వద్ద, పత్తికొండ వద్ద అడుగడుగునా కి.మీ. మేర పోలీసులు కాపలా కాస్తూనే ఉన్నారు. మండిపోతున్న ఎండలకు ఓ వైపు పోలీసులు, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వాహనదారులు నలిగిపోయారు.

వలస కూలీల విలవిల

తుగ్గలి మండలం పగిడిరాయికు చెందిన పలువురు కూలీలు వలసవెళ్లి తిరిగి వస్తూ.. తుగ్గలి వద్ద నిర్వహించిన ముఖ్యమంత్రి సభ సమీపంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. గంటల సేపు ఎండకు తాళలేక వారు నెత్తిపై పట్టాలు కప్పుకొని కూర్చున్నారు. వాహనంలోని మహిళలు వడదెబ్బకు గురైనట్లు సమాచారం.

చిన్నారికి బస్సులోనే ఊయల కట్టి

ఆర్టీసీ బస్సులో ఆదోని నుంచి అనంతపురం వెళ్తున్న ఓ మహిళ గంటల సేపు బస్సు మధ్యలోనే పోలీసులు నిలిపివేయడంతో తన కుమార్తెకు బస్సులోనే ఊయల కట్టి ఊపారు. బస్సులో వేడికి పాప ఇబ్బంది పడుతోందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చెప్పాపెట్టకుండా బస్సులు, ఇతర వాహనాలు నిలిపేస్తే ప్రయాణాలు సాగించే చిన్నారులు, వృద్ధులు, మహిళల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

నాలుగు గంటలు నరకం చూశా

మహానంది, డ్రైవర్‌

పోలీసులు తుగ్గలి వద్ద వాహనం నిలిపివేయడంతో నాలుగు గంటల పాటు నరకం చూశా. సరకుల వాహనంతో మంత్రాలయం నుంచి అనంతపురం వెళ్తున్నా. ఉదయం 9.30 గంటలకు తుగ్గలి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద మా వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. మధ్యాహ్నం 1.30 గంటలు దాటినా.. వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ దారుల్లో వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని