logo

18న ఎన్నికల ప్రకటన విడుదల

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 18న ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన తెలిపారు.

Published : 16 Apr 2024 06:30 IST

ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
కలెక్టర్‌ డా.సృజన


సమీక్షిస్తున్న కలెక్టర్‌  డా.జి సృజన

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 18న ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన తెలిపారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నామినేషన్‌ పత్రాలను ఈరోజు నుంచే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యర్థి కోసం సంతకాలు చేసి దరఖాస్తులు తీసుకెళ్లాలన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వాహనాలను 200 మీటర్ల దూరంలో ఆపేయాలని పేర్కొన్నారు. అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులకు మాత్రమే నామినేషన్‌ వేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారం రోజున నామినేషన్లు స్వీకరించమని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 14 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉద్యోగుల చేతికి ఇవ్వమని.. ప్రతి ఆర్వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్‌ కౌంటరులోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయాలన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే వారికి మాత్రమే పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. హోమ్‌ ఓటింగ్‌కు సంబంధించి ఏప్రిల్‌ 18 నుంచి 21వ తేదీ వరకు బీఎల్వోల ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. మే 10వ తేదీలోగా ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని