logo

రూ.5 కోట్ల.. కోట భూమిని కొట్టేశారు

రాజులు పోయారు.. కోటలు మిగిలాయి.. వాటి చుట్టూ ఉన్న భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.. రూ.5 కోట్ల విలువైన భూమికి నకిలీ పట్టాలు పుట్టించి విక్రయిస్తున్నారు..

Published : 05 May 2024 02:48 IST

నకిలీ పట్టాలు పుట్టించి పంపిణీ

నకిలీ ఇంటి పట్టాలు

నంద్యాల, న్యూస్‌టుడే: రాజులు పోయారు.. కోటలు మిగిలాయి.. వాటి చుట్టూ ఉన్న భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.. రూ.5 కోట్ల విలువైన భూమికి నకిలీ పట్టాలు పుట్టించి విక్రయిస్తున్నారు.. గడివేముల మండలం గని గ్రామంలో రాజుల కాలంలో నిర్మించిన కోట చుట్టూ భూములు ఉన్నాయి.. రెవెన్యూ లెక్కల ప్రకారం సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది. ఖాళీగా ఉన్న స్థలాల్లో గ్రామానికి చెందిన కొందరు కల్లాలు ఏర్పాటు చేసుకొని గడ్డివాములు నిల్వ చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరి కళ్లు ఆ భూములపై పడ్డాయి. అక్కడ మైనార్టీల కోసం షాదీఖానా నిర్మిస్తున్నామంటూ గడ్డివాములు తీసివేయించారు. తర్వాత గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, వాలంటీరు కలిసి ఆక్రమణ కథ నడిపించారు. గతంలో పనిచేసిన తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలు సృష్టించారు. కొందరికి 1.50 సెంట్లు, మరికొందరికి 1.65 సెంట్ల పట్టాలు ఇచ్చారు. ఇందుకు ఒక్కో వ్యక్తి వద్ద రూ.35 వేల వరకు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు 34 మందికి నకిలీ పట్టాలు ఇచ్చారు. నకిలీ పట్టాలతో పాటు నకిలీ ఫొజిషన్‌ పత్రాలూ పుట్టించారు. పట్టాలు తీసుకున్న వారి స్థలం వారి ఆధీనంలోనే ఉన్నట్లు ఫొజిషన్‌ సర్టిఫికెట్లు తయారు చేయించారు. అక్రమాలు సక్రమం చేసుకోవడానికి నకిలీ పట్టాల నకళ్లను తహసీల్దారు కార్యాలయంలోని దస్త్రాల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ గ్రామ రెవెన్యూ అధికారి సహకారంతో ఇదంతా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామం నడిబొడ్డున ఖాళీ స్థలం ఉన్నా అక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేయకుండా ఊరికి దూరంగా ఇచ్చారు.. ‘కోట’ భూములను పేదలకు ఇచ్చి ఉంటే బాగుండేదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని