logo

8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి సృజన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Published : 07 May 2024 06:11 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి సృజన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మిగనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 20 వేల మందికి పైగా ఓటర్లకు ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఓటర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫెసిలిటేషన్‌ సెంటర్ల వివరాలను తెలియపరిచామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటర్ల జాబితాలో పేరు ఉండి, అనివార్య కారణాల వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతే, ఏ నియోజకవర్గంలో ఓటు ఉంటే ఆ నియోజకవర్గం ఆర్వోకు 6, 7, 8 తేదీల్లో ఫారం-12 దరఖాస్తు, ఎన్నికల డ్యూటీ ఆర్డర్లను సమర్పించి, అక్కడే ఉన్న ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఎమ్మిగనూరులో 2,400 మంది ఉద్యోగస్తులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల సంఖ్యను బట్టి ఇంకొక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర జిల్లాలో ఓటు ఉన్నవారు వారు పనిచేస్తున్న నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలోనే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఆర్వో చిరంజీవి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పోస్టల్‌ బ్యాలట్‌ ఆంశంపై ఆందోళనొద్దు

నంద్యాల జిల్లాలో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ అంశంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నంద్యాల జిల్లా ఆర్వోల వద్ద ఉద్యోగుల జాబితా ఉందని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలట్‌ కోసం నంద్యాల జిల్లా ఆర్వోలకు ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకున్న అందరికీ పోస్టల్‌ బ్యాలట్‌తో పాటు ఉద్యోగుల జాబితాను నంద్యాల జిల్లాకు పంపామని చెప్పారు. నంద్యాల జిల్లా పోస్టల్‌ బ్యాలట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటు లేదని చెబుతున్నారంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. నంద్యాల జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్వోల వద్ద మొత్తం ఉద్యోగుల జాబితా (1,221) ఉందని జేసీ వివరించారు. ఉద్యోగులు సంబంధిత ఆర్వోల వద్దకు వెళ్లి జాబితాను పరిశీలించాలని కోరారు. ఒకవేళ జాబితాలో పేరు లేకుంటే కర్నూలు నగరంలోని బి.క్యాంపులో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు మంగళవారం వచ్చి దరఖాస్తును పాణ్యం ఆర్వోకు ఇవ్వొచ్చని.. 8వ తేదీన వీరికి ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు.
పాణ్యంలో ప్రారంభంకాని హోమ్‌ ఓటింగ్‌
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాలుండగా.. ఏడు నియోజకవర్గాల్లో హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలులో 53, కోడుమూరులో 127, పత్తికొండ 118, ఆలూరు 228, ఆదోని 63, ఎమ్మిగనూరు 171, మంత్రాలయం 78 మంది హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 50 బృందాలను ఏర్పాటు చేశారు. పాణ్యం నియోజకవర్గంలో హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాలేదు. నంద్యాల పార్లమెంట్‌కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్‌ సోమవారం పూర్తైంది. దీంతో మొదటి రోజు హోమ్‌ ఓటింగ్‌ ప్రారంభం కాలేదు. హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 159 మందికి వారి ఇంటి దగ్గరకే పది బృందాలు మంగళ, బుధవారాల్లో వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహణ పూర్తి చేస్తాయని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని