logo

వెలుగోడు రైతులకు జగన్‌ ఉరి

కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు.

Updated : 08 May 2024 07:10 IST

కడపకు తరలింపు
తెలుగు గంగకు నీళ్లివ్వని వైనం        
నాలుగేళ్లుగా రెండో పంట ఎండబెట్టారు

నంద్యాల పట్టణం, వెలుగోడు న్యూస్‌టుడే: కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు. 1993 నుంచి వెలుగోడు జలాశయం ద్వారా తెలుగుగంగ జలాలు నేల తాకుతుండగా.. 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక కారు పంటకు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. ఇదే క్రమంలో పక్క జిల్లా ప్రజాప్రతినిధుల మెప్పు పొందడానికి గుట్టుచప్పుడు కాకుండా సాగునీటిని ఇతర జిల్లాలకు తరలించడంతో ఈ ప్రాంత రైతులు విలవిల్లాడిపోతున్నారు.


16 టీఎంసీలు.. 70 వేల ఎకరాలు

శ్రీశైలం వెనకజలాలను పోతిరెడ్డి పాడు నుంచి వెలుగోడు జలాశయంలోకి తరలిస్తారు. 16 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. 70 వేల ఎకరాల్లో వరి, అరటి, మినుము, పొగాకు, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేస్తారు. ఎగువ నుంచి జల పరవళ్లు లేకపోవడంతో తొమ్మిది టీఎంసీలు నిల్వ చేయలేని పరిస్థితి. వారబందీ పద్ధతి (15 రోజులకోసారి)లో నీటిని విడుదల చేశారు.  ఏడు విడతల్లో 1,14,500 ఎకరాలకు సాగునీటిని అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడి పంటలను ఎండబెట్టి రెండు టీఎంసీల నీటిని పొరుగు జిల్లాకు తరలించారని రైతులు మండిపడుతున్నారు.


లైనింగ్‌ పేరుతో బురిడీ

రెండేళ్లలో పూర్తి చేయాల్సిన లైనింగ్‌ పనులు సా..గుతున్నాయి. ఆలస్యానికి జరిమానా వేయకుండా అదనంగా బిల్లులు చెల్లించడం గమనార్హం. లైనింగ్‌కు మొదట రూ.239 కోట్లు కేటాయించిన  ఆ మొత్తాన్ని రూ.500 కోట్లకు పెంచి పాత గుత్తేదారునికే పనులు అప్పగించింది. . ఇప్పటికీ  రెండో పంట నష్టపోతున్నారు. నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం (నీటి ఆవిరి, వృథాలు కలిపి) ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాలు పండిండొచ్చు. గత నాలుగేళ్లులో 40 వేల ఎకరాల్లో పంట వేయలేకపోయారు.


రెండు టీఎంసీలు ఎక్కడికెళ్లినట్లు

ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగోడు జలాశయంలో ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అందులో నంద్యాల, ఆళ్లగడ్డ పట్టణాలకు మంచినీటి అవసరాలకు 1 టీఎంసీ వినియోగించారు. డెడ్‌స్టోరేజ్‌ కింద 1 టీఎంసీని నిల్వ చేయాల్సి ఉంటుంది. అప్పటికే 1 టీఎంసీ నీటిని  పంటలకు అందించారు. మిగిలిన రెండు టీఎంసీల నీటిని విడతల వారీగా పొరుగు జిల్లాకు తరలించారు. వెలుగోడు జలాశయం నుంచి కేసీ కెనాల్‌ ద్వారా గాలేరు నగరి మీదుగా సీఎం సొంత జిల్లా వైఎస్సార్‌ జిల్లాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో వెలుగోడులో మూడు టీఎంసీల నీరు ఉన్న సమయంలోనే తెలుగుగంగ, కేసీ కాల్వ కింద రెండు పంటల్ని రైతులు పండించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సాగునీటి విడుదలలో విఫలమయ్యారని వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల రైతులు వాపోతున్నారు.


నాలుగేళ్లుగా రెండో పంటకు నీరేదీ

తెలుగుగంగ జలాశయం ద్వారా వెలుగోడు మండలంలో నాలుగు వేల ఎకరాలు, బండి ఆత్మకూరులో 12 వేలు, మహానందిలో మూడు వేలు, రుద్రవరం 25 వేలు, ఆళ్లగడ్డ 25 వేలు, చాగలమర్రి మండలంలో 26 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రధాన కాల్వ లైనింగ్‌ పేరుతో 2020 నుంచి రెండో పంటకు (రబీ) నీరు ఇవ్వడం లేదు. లైనింగ్‌ పనులు పేరిట సాగు నీటిని విడుదల చేపట్టకపోవడంతో ఈర్నపాడు, సోమయాజులపల్లె, వెంగళరెడ్డిపేట, శింగవరం, నారాయణాపురం, చిన్నదేవళాపురం, జీసీపాలెం గ్రామాల్లో పొలాలు బీళ్లుగా మారాయి. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం, రేగడగూడూరు, వేల్పనూరు, బండిఆత్మకూరు మండలం యర్రగుంట్ల గ్రామాల్లో రెండో పంట కింద సాగు చేసిన మెట్టపంటలకు నీరు అందకపోవడంతో దెబ్బతిన్నాయి. కేసీ కెనాల్లో మోటార్లు పెట్టుకుని నీటిని తీసుకెళ్తే అధికారులు పైపులు ధ్వంసం చేశారు.


ఆర్థికంగా చితికిపోయారు

- పాశశంకర్‌, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు

మూడేళ్ల నుంచి రెండో పంటకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఖరీఫ్‌లో సాగు చేసే వరికి అధిక చీడపీడలు వస్తాయి. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గుతాయి. రైతులకు ఖరీఫ్‌లో ఖర్చులు, కౌలు పోగా పెద్దగా మిగలదు. రబీలో సాగు చేసే వరిపంటకు చీడపీడలు తక్కువగా ఉండటంతో దిగుబడులు పెరిగి...రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రబీకి సాగునీరు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి తలకిందులైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని