logo

బీసీలకు 50 ఏళ్లకే పింఛను

‘‘ బీసీల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేసింది. మ్యానిఫెస్టోలో ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. 50 ఏళ్లకే వారికి పింఛను అందనుంది. ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందించనున్నాం.

Published : 09 May 2024 03:25 IST

యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
సూపర్‌-6 పథకాలతో బంగారు భవిష్యత్తు
కర్నూలు పార్లమెంట్‌ తెదేపా ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు

కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బస్తిపాటి నాగరాజు

ఈనాడు, కర్నూలు : ‘‘ బీసీల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేసింది. మ్యానిఫెస్టోలో ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. 50 ఏళ్లకే వారికి పింఛను అందనుంది. ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందించనున్నాం. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాం. ‘తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌-6 పథకాలతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. ప్రతి వర్గానికి చేయూత అందించేలా చర్యలు చేపట్టాం. ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాం’ అని కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ‘ఈనాడు’తో ముఖాముఖిలో పాల్గొని పలు అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు

ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కూటమి నిర్ణయం మహిళలకు వరం లాంటిది. ‘‘ఉమ్మడి జిల్లాలో 13.31 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.858 ఉంది. నిత్యం 44,370 సిలిండర్ల వినియోగం అవుతోంది.

రైతుకు ఏటా రూ.20,000 సాయం

రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థికసాయం అందించనున్నాం. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో 10లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. సన్న, చిన్నకారు, మధ్యకారు, పెద్ద రైతులు 7.40 లక్షల మంది ఉన్నారు. కేంద్రం సాయాన్నే తన సాయంగా వైకాపా ప్రచారం చేసుకుంటూ రైతులను మోసం చేసింది. రాయితీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం. రాయితీపై సోలార్‌ పంపుసెట్లు, బిందుసేద్యం, వ్యవసాయ పరికరాలు అందిస్తాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.

స్థానిక సంస్థల్లో  34 శాతం రిజర్వేషన్లు

స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను వైకాపా ప్రభుత్వం 10 శాతం తగ్గించింది. ఫలితంగా 16,800 మంది బీసీలు రాజ్యాంగబద్ధ పదవులకు దూరమయ్యారు. మేము 34 శాతానికి పెంచుతాం. నామినేటెడ్‌ పదవుల్లోనూ 34 శాతం పదవులు కేటాయిస్తాం. రూ.1.50 లక్షల కోట్లను బీసీల సంక్షేమానికి ఉపయోగిస్తాం. బీసీల స్వయం ఉపాధికి మరో రూ.10 వేల కోట్లు వెచ్చిస్తాం. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25 వేల గౌరవ వేతనం అందిస్తాం. సెలూన్లు నడిపేవారికి 200 యూనిట్ల విద్యుత్తు ఉచితం. రూ.5 వేల కోట్లతో ‘ఆదరణ’ పథకాన్ని పునరుద్ధరిస్తాం. పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల సాయం చేస్తాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు అందజేస్తాం. ఆయా నిర్ణయాల కారణంగా జిల్లాలో సుమారు 13.50 లక్షల మంది బీసీలకు మేలు జరుగుతుంది.

మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తాం. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా.. 975 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం నిత్యం 1.50 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు.

నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి

యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం. మెగా డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు యువతకు ఉపాధి లభించేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. ఉమ్మడి జిల్లాలో 30-50వేలకుపైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుచేయడంలో భాగంగా తెదేపా హయాంలో 10వేల ఎకరాల్లో సేకరించారు.

ఆరోగ్యశ్రీ బీమా రూ.25 లక్షలు

ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించడానికి వీలుగా ఏకంగా రూ.25లక్షల బీమాను కల్పించడానికి తెదేపా హామీనిచ్చింది. జిల్లాలో 20లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. చంద్రన్న ప్రమాద బీమా కింద సహజ మరణానికి రూ.5లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం.

ప్రతి మహిళకు నెలకు రూ.1,500

మహిళల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని 19ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ఉమ్మడి జిల్లాలో 19ఏళ్లకుపైబడి 16,49,082మంది మహిళలు ఉన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం అందిస్తాం. ఈ మొత్తంతో వారు వ్యాపారాలు చేసుకొని ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అందిస్తాం. ఆయా పథకాల కారణంగా జిల్లాలోని పది లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది.

బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి  రూ.15 వేలు

ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందిస్తాం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అందరికీ ఇస్తాం.  ఫలితంగా నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ‘‘ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి 4,199 వరకు ఉన్నాయి. వీటిలో 7,45,303 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 5,16,893 మంది ఉన్నారు.

ఆస్తులకు రక్షణ కల్పిస్తాం

వైకాపా ప్రభుత్వం టైటిలింగ్‌ చట్టం తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసింది. న్యాయం పొందే హక్కు కాలరాసింది. ఈచట్టంపై రైతులతోపాటు ప్రజలూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భూ సర్వేలో పలువురు తమ విలువైన భూమిని కోల్పోయారు. చట్టం అమలైతే భూములు చట్టపరంగానే కబ్జాదారుల పరమవుతాయని ఈ చట్టం అమలు చేయకూడదని తెదేపా నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆస్తులను రక్షించేలా తెదేపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

హజ్‌ యాత్రికులకు రూ.లక్ష

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశాం. హజ్‌ యాత్రకు వెళ్లేవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. ఇమామ్‌లకు ప్రతి నెలా రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించాం. మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేల సాయం చేస్తాం. మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు అందిస్తాం. రంజాన్‌ తోఫా, దుల్హన్‌ పథకాలు అమలు చేస్తాం. ఆయా పథకాల కారణంగా జిల్లాలో సుమారు 3.4 లక్షల మంది ముస్లింలకు మేలు చేకూరుతుంది.

పశ్చిమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నిత్యం కరవు కాటకాలతో విలవిలలాడే కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణంతో కర్నూలు పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేదవతి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు సైతం నిధులు మంజూరు చేశారు. ఆర్డీఎస్‌ పనులకు చర్యలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా కీలక ప్రాజెక్టులను పూర్తిగా గాలికొదిలేసింది. ఫలితంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మేము ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.

మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుచేస్తాం

ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను చంద్రబాబునాయుడు ఏర్పాటు చేస్తే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయింది. మేము ఆ హబ్‌లో పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఫలితంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. వలస వెళ్లే అవకాశముండదు. మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం.

వృద్ధులకు రూ.4 వేల పింఛను

వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలకు సామాజిక భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతాం. ఏప్రిల్‌, మే నెలలకు బకాయిలను జూన్‌ పింఛనులో ఇస్తాం. దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు ఇస్తాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు అందిస్తాం. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అర్హులైనవారికి పింఛన్లు అందడం లేదు. వీరిని గుర్తించి పింఛన్లు అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని