logo

నాసి మద్యం.. బతుకు నరకం

ఎన్నికలనగానే ప్రతి పార్టీకి ఓ మ్యానిఫెస్టో ఉంటుంది.. ప్రచార వ్యూహం ఉంటుంది.. ఎత్తుగడలూ ఉంటాయి.. వీటికి అదనంగా ఉండే మరొకటి మందు వ్యూహం.. ఈ దఫా ఎన్నికల్లో మద్యం ఏరులై పారించేందుకు సిద్ధం చేశారు.

Published : 09 May 2024 03:31 IST

ఓటర్లను మత్తులో ముంచుతున్న నేతలు
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ఎన్నికలనగానే ప్రతి పార్టీకి ఓ మ్యానిఫెస్టో ఉంటుంది.. ప్రచార వ్యూహం ఉంటుంది.. ఎత్తుగడలూ ఉంటాయి.. వీటికి అదనంగా ఉండే మరొకటి మందు వ్యూహం.. ఈ దఫా ఎన్నికల్లో మద్యం ఏరులై పారించేందుకు సిద్ధం చేశారు. ఓటర్లను మత్తులోకి దించి ఓట్లను కొల్లగొట్టే పనిలో పడ్డారు.. సీసా మీదే నమ్మకం పెట్టుకున్నారు.. గోవా, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు.. ఇందులో చాలా వరకు నకిలీ మద్యమే.. అది భూతం లాంటింది.. ఒంట్లో పడిదంటే కాలేయం ఖతమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలూ మీ మగవాళ్లు జాగ్రత్త.. తల్లిదండ్రులూ యువతరాన్ని అటువైపు వెళ్లనీయవద్దు.. మీ ఇంటికి సీసా భూతం తెచ్చుకోవద్దు.

కల్తీ మద్యంతో ఆరోగ్యంపై ప్రభావం

- డాక్టర్‌ శంకర్‌శర్మ, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు

పేదలు, కూలీలు, హమాలీలు చీప్‌ లిక్కర్‌ తాగుతూ ఉంటారు. కొన్నేళ్లుగా నాణ్యమైన మద్యం తాగుతున్నవారిలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండేవి కావు. గతంలో కాలేయ జబ్బుల బారిన పడేవారి సంఖ్య తక్కువగా ఉండేది. ప్రస్తుతం చీప్‌ లిక్కరు ఎక్కువగా తీసుకునేవారిలో కాలేయం జబ్బుల బారిన పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. చీప్‌ లిక్కర్‌ తీసుకునేవారిలో మొదట లివర్‌, తర్వాత నరాలకు సంబంధించిన జబ్బులబారిన పడటం.. మరికొందరికి గుండె సంబంధిత జబ్బులు వస్తుంటాయి. మద్యంలో మిథైల్‌ ఆల్కహాల్‌ ఎక్కువ మోతాదులో ఉంటే కాళ్ల వాపులు, పొట్ట ఉబ్బడం, కాలేయం వంటి సమస్యలు వస్తాయి.

గోవా నుంచి భారీగా తరలింపు

గోవాలో మద్యం తయారీ కంపెనీలు ఎక్కువ. అసలు బ్రాండుకు ఏ మాత్రం తీసిపోకుండా తయారు చేస్తుంటారు. స్థానిక మద్యం ధరలతో పోలిస్తే ధర చాలా తక్కువ. మన వద్ద అమ్మే బ్రాండ్లను సగం ధరకే విక్రయిస్తారు. పైగా ఆయా కంపెనీలు పన్ను ఎగవేసేందుకు అనధికారికంగా మద్యం తయారు చేసి తక్కువ ధరకే స్మగ్లర్లకు విక్రయిస్తారు. గోవా నుంచి కర్ణాటక మీదుగా జిల్లాకు తరలించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన పలువురు నాయకులు తక్కువ ధరకు లభించే గోవా మద్యం దిగుమతి చేసుకొని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. గోవా మద్యం తరలిస్తున్న కంటెయినర్‌ ఇటీవల నంద్యాల పరిధిలో పట్టుబడిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇదివరకే వేర్వేరు మార్గాల ద్వారా రహస్య స్థావరాలకు గోవా మద్యం జిల్లాకు చేరుకుంది. అసలు మద్యానికి, గోవా మద్యానికి తేడా తెలియని మందుబాబులు చేతికి అందిన వెంటనే తెగ తాగేస్తున్నారు.

కడుపులో మంట.. కాలేయానికి తంటా

మద్యం కారణంగా కాలేయం దెబ్బతిన్న సుమారు 40 నుంచి 50 మంది ప్రతి నెలా కర్నూలు పెద్దాస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చేరుతుంటారు. ఈ విభాగానికి ఏటా 2 వేల మంది ఓపీ ఉంటుంది. 600 వరకు ఐపీ ఉంటుంది. ఈ విభాగానికి గతంలో ఓపీ, ఐపీ తక్కువగా ఉండేది. ఐదేళ్ల కాలంలో బాధితులు పెరిగారు. కాగా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చేవారిలో యువకులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నవారు చివరికి చనిపోతుంటారు. ‘‘ చాలా ఏళ్లుగా మద్యం తాగుతున్నా.. అంతకు ముందెన్నడూ ఆరోగ్య సమస్యలు లేవని.. ప్రస్తుతం నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని’’ పలువురు బాధితులు వాపోయారు.

కర్ణాటక టెట్రా ప్యాకెట్లు

పొరుగు మద్యం(కర్ణాటక) పొంగుతోంది. ఉమ్మడి జిల్లాలో 54 మండలాల్లో సుమారు 1,317 వరకు గ్రామాలున్నాయి. 75 శాతం గ్రామాల్లో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. ఏపీ సర్కారు బ్రాండ్లకు సంబంధించి ఒక్క సీసా కొనుగోలు చేయాలంటే రూ.150 వెచ్చించాలి. అదే కర్ణాటక మద్యానికి రూ.40.01 చెల్లిస్తే సరిపోతుంది. దీంతో కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయాలను కొందరు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. ప్రతి నెలా రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల మేర కర్ణాటక మద్యం అక్రమ రవాణా, వ్యాపారం కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా నిల్వ చేసి చేసుకున్నారు.

బలి అవుతోంది దినసరి కూలీలే

తాగే అలవాటున్న వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలు, శారీరక శ్రమ చేస్తూ బతికేవారే. మద్యం తాగడంతో వారిని నిస్సత్తువ, నీరసం ఆవహించడం, కాళ్లు, చేతులు వణకడం, ఆయాసంతో గతంలో మాదిరి శారీరకంగా శ్రమించలేకపోతున్నారు. ఫలితంగా ఉత్పాదకత దెబ్బతిని, వారి ఆదాయాలు గణనీయంగా పడిపోతున్నాయి. సత్తువ కోల్పోయి నెలలో సగం రోజులకుపైగా పనికి వెళ్లడం లేదు. అనారోగ్యంతో మంచం పడుతున్నారు. ‘‘ గోస్పాడుకు చెందిన నాగశేషుడు హమాలీ. ఒళ్లు నొప్పులు తట్టుకోలేక నిత్యం మద్యం తాగుతున్నాడు. వైద్యుడి వద్దకు వెళ్లగా కాలేయానికి ఇన్ఫెక్షన్‌ వచ్చిందన్నారు. అతను మూడు నెలలుగా కర్నూలు, నంద్యాల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

విమోచన కేంద్రానికి పరుగులు

  • కర్నూలు సర్వజన వైద్యశాలలోని మత్తు పదార్థాల విమోచన కేంద్రానికి 2021 నుంచి ఏటా ఓపీ సుమారు 3 వేల నుంచి 3,500 వరకు ఉంటోంది. ఐపీ సుమారు వెయ్యి వరకు ఉంటోంది. ఈ మూడేళ్ల కాలంలో 9 వేల మంది ఓపీకి రాగా.. సుమారు 3 వేల ఐపీగా ఉంది. మద్యం తదితర దురలవాట్లకు బానిసైన సుమారు 512 మంది ఈ కేంద్రంలో చికిత్సతోపాటు కౌన్సెలింగ్‌ తీసుకుని తమ వ్యసనాలు మానుకున్నారు. ఈ కేంద్రంలో నెలకు సుమారు 20-30 మంది వచ్చి సేవలు పొందుతుంటారు. దీనిని 10 పడకలతో ఏర్పాటు చేశారు.
  • బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ... ‘‘ మద్యానికి బానిసలై ఆసుపత్రుల పాలవుతున్న బాధితులంతా లివర్‌ సిర్రోసిస్‌, పాంక్రియాస్‌, కడుపులో మంట, అజీర్తి, కండరాల నొప్పి, తల తిప్పడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.’’’

పల్లెల్లో సారాసురులు

న్యూస్‌టుడే కర్నూలు నేర విభాగం, వైద్యాలయం: నిరుపేద మందుబాబులకు నాటు సారానే ప్రత్యామ్నాయంగా మారింది. ఫలితంగా సారాకు గిరాకీ పెరిగి వ్యాపారం విస్తరించింది. సారా రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన పూర్తిగా విఫలమైంది. కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలు చేయకపోవడం, కొందరి స్వార్థంతో పల్లెల్లో నాటుసారా వ్యాపారం విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 180 సారా ప్రభావిత ప్రాంతాలున్నాయి. ఆయా గ్రామాల్లో సారా తాగడంతో నిత్యం ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

చెట్టంత కుమారుడు బలయ్యాడు

చాకలి తిక్కన్న, మద్దికెర

నేను గతంలో హమాలీగా పని చేసి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మద్దికెరలో లాండ్రీ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నా కుమారుడు క్రాంతికుమార్‌ మద్యానికి అలవాటు పడి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో మద్యానికి బానిసై తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మద్యం తాగితే ప్రాణాలకు ముప్పని ఎంత మంది చెప్పినా వినలేదు. గత నెల 7న కాలేయం పాడై మృతి చెందాడు. చేతికంది వచ్చిన కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని భావిస్తే మద్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుని మాకు కడుపు కోత మిగిల్చాడు. వయసు పైబడిన మాకు దిక్కెవరు. మా కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.

న్యూస్‌టుడే, మద్దికెర

కష్టాలు ఎదుర్కొంటున్నాం

శేఖమ్మ, హొళగుంద

న్యూస్‌టుడేË, హొళగుంద: మేము 7వ వార్డులో నివాసముంటున్నాం. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. నా భర్త దేవణ్న (56) గతేడాది నవంబరు 24న మృతి చెందారు. ఆయన రోజూ మద్యం తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించింది. మాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. 8 నెలల కిందల రూ.4 లక్షల అప్పు చేసి ముగ్గురు అబ్బాయిలకు వివాహాలు జరిపించాం. వారి వివాహమైన నెలకే మా ఆయన మృతి చెందారు. అప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఎకరం పొలం ఉంది. వర్షాల మీద ఆధారపడటంతో పంటలు పండటం లేదు. కూలీ పనులకు వెళ్లి జీవిస్తున్నాం. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. పిల్లలతోపాటు నేను కూలీ పనికి వెళ్లక తప్పడం లేదు. వితంతు పింఛను కూడా రావడం లేదు.

ఒకరిని బడికి.. మరొకరిని పనికి

గౌరమ్మ, పత్తికొండ

న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం: నా భర్త హనుమన్న ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసేవారు. కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మా ఆయన రోజూ మద్యం తాగేవారు. దీంతో ఆరోగ్యం క్షీణించి రెండున్నరేళ్ల కిందట మృతి చెందారు. అప్పటి వరకు బాగా ఉన్న మా కుటుంబంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. కుటుంబ భారం మొత్తం నాపై పడింది. పిల్లల్ని పోషించడానికి దినసరి కూలీగా హోటళ్లలోనూ, భవన నిర్మాణ కూలీగా వెళ్తున్నాను. పిల్లల చదువులు భారం కావడంతో చిన్న వయసులోనే కుమార్తెకు వివాహం చేశా. ఇద్దరు కుమారుల్లో ఒకరిని ప్రభుత్వ పాఠశాలకు, మరొకరిని కూలీ పనులకు పంపుతున్నా. నాకు ఇంత వరకు వితంతు పింఛను రావటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని