logo

నిర్వాసితులపై జగన్‌ పైసాచికత్వం

నీళ్లొస్తే బతుకులు బాగుపడతాయని ఆలోచించారు. జీవనాధారమైన భూములను త్యాగం చేశారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Published : 10 May 2024 02:39 IST

నీళ్లొస్తే బతుకులు బాగుపడతాయని ఆలోచించారు. జీవనాధారమైన భూములను త్యాగం చేశారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘న్యాయ’ స్థానం ఆదేశించినా ‘న్యాయం’ చేయడం లేదు కదా.. భూములను రెడ్‌మార్క్‌లో పెట్టేశారు. దీంతో అటు పరిహారం రాక.. ఇటు పంట రుణాలు పొందలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.  

 -నంద్యాల పట్టణం, పాణ్యం గ్రామీణం న్యూస్‌టుడే 

 పొలం అమ్మలేరు.. రుణం పొందలేరు

కుందూనదిపై కోవెలకుంట్ల మండలం జొలదరాశి సమీపంలో 0.8 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవెలకుంట్ల, బనగానపల్లి, గోస్పాడు మండలాల్లోని 13 గ్రామాల్లో 627 ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.16 లక్షల పరిహారం చెల్లిస్తామని ఏడాది కిందట మాటిచ్చారు. గతేడాది జులైలో పట్టాదారు పాసుపుస్తకాల నకళ్లు తీసుకున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టలేదు. ఇంత వరకు పైసా చెల్లించలేదు. సేకరించిన భూములు ‘రెడ్‌మార్క్‌’లో పెట్టేయడంతో రైతులు విక్రయించలేక, మార్టిగేజ్‌ చేయలేక, బ్యాంకుల్లో పంట రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.

న్యాయస్థానం తలంటినా

ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ విస్తరణకు బనకచెర్ల రెగ్యులేటô్ నుంచి గోరుకల్లు జలాశయం వరకు 2006లో భూములు సేకరించారు. జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, మిడుతూరు, గడివేముల మండలాల్లో వందలాది ఎకరాల భూములు తీసుకున్నారు. ఆ సమయంలో ఎకరాకు రూ.76 వేల ధర నిర్ణయించారు. మిడుతూరు, గడివేముల మండలాల్లో సుమారు 389 ఎకరాల భూములు సేకరించారు. పరిహారం సరిపోదని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎకరాకు రూ.1.60 లక్షలు ఇవ్వాలని న్యాయస్థానం నిర్ణయించింది. భూముల ధరతో పాటు, వడ్డీ ఇతర కలిపి సుమారు రూ.16 కోట్ల మేర పరిహారం ఇవ్వాల్సి ఉంది. తలముడిపిలో 26 మంది రైతులు 76 ఎకరాల భూములు కోల్పోయారు. వారికి రూ.68.98 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నాలుగేళ్ల కిందట జీవో జారీ చేసింది. నేటికి పరిహారం ఇవ్వలేదు. దీంతో రైతులు తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

రైతు నెత్తిన రాజోలిబండ

చాగలమర్రి మండలం రాజోలి వద్ద 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించేందుకు గొట్లూరు, రాజోలి, ఉయ్యాలవాడ మండలం కాకరవాడ, ఆర్‌.జంబులదిన్నె గ్రామాల్లో 766 ఎకరాలు తీసుకున్నారు. ఎకరాకు రూ.12.50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఏడాదిన్నర కిందట భూములు సేకరించి, వాటికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల నకళ్లను తీసుకున్నారు. ఇంత వరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఒక్క పైసా పరిహారం చెల్లించకపోగా సేకరించిన భూములను ‘రెడ్‌మార్క్‌’లో పెట్టడంతో రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారు.

గోరుకల్లు.. గుండెఘొల్లు

గోరుకల్లు జలాశయం నిర్మాణానికి 2005లో శ్రీకారం చుట్టారు. ఇందుకు 750 మంది రైతుల నుంచి 1250 ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.70 వేలు చెల్లించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారం సరిపోదని 750 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఎకరాకు రూ.1.70 లక్షల పరిహారం ఇవ్వాలని 2013లో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 2016 నుంచి 2018 వరకు రైతులకు పరిహారం పంపిణీ చేశారు. నిర్వాసితుల్లో గోరుకల్లు తండాకు చెందిన తొమ్మిదిమంది రైతులకు చెందిన 22.36 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వాటికి పరిహారం పెంచాలని హైకోర్టును ఆశ్రయించగా అదనంగా చెల్లించాల్సిందేనని 2017లో న్యాయస్థానం ఆదేశించింది. తొమ్మిది మంది రైతులకు రూ.72.29 లక్షల పరిహారం రావాల్సి ఉంది.
‘‘ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు.. మీ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.200 కోట్లు పనులు చేపడుతున్నారు. మా ప్రాంతం నుంచీ నీటిని తీసుకెళ్తున్నారు. రూ.72.29 లక్షల పరిహారం ఇచ్చేందుకు చేతుల రావడం లేదా అని గోరుకల్లుకు నిర్వాసితులు బుగ్గనను ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని