logo

గద్వాల కోటలో హోరాహోరీ

నడిగడ్డగా పేరున్న గద్వాల నియోజకవర్గంలో ఆది నుంచి ఎక్కువగా రెండు కుటుంబాల మధ్యనే హోరాహోరీ పోరు కొనసాగింది. ఎన్నికల్లో పలు మార్లు డీకె సత్యారెడ్డి కుటుంబం పాగ పుల్లారెడ్డి కుటుంబాలు తలపడ్దాయి.

Updated : 06 Nov 2023 05:41 IST

పోరు ఇలా...

నియోజకవర్గ కేంద్రం గద్వాల

న్యూస్‌టుడే, గద్వాల : నడిగడ్డగా పేరున్న గద్వాల నియోజకవర్గంలో ఆది నుంచి ఎక్కువగా రెండు కుటుంబాల మధ్యనే హోరాహోరీ పోరు కొనసాగింది. ఎన్నికల్లో పలు మార్లు డీకె సత్యారెడ్డి కుటుంబం పాగ పుల్లారెడ్డి కుటుంబాలు తలపడ్దాయి. తర్వాతి క్రమంలో ఒక్క సారి గట్టుభీముడు బీసీ నినాదంతో బరిలోకి దిగి డీకె బంగ్లా పాలనను ఢీకొట్టి గెలిచాడు. తర్వాత అయన ఓటమి పాలు కావటంతో తర్వాత క్రమంలో పోటీ డీకే.అరుణ ఆమె మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి మధ్య కొనసాగుతూ వచ్చింది. 1957 నుంచి 2023 వరకు జరిగిన ఎన్నికలో ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో డీకే కుటుంబం బరిలో నిలిచింది. గద్వాల నియోజకవర్గ ఎన్నికల స్వరూపం 1957 నుంచి పరిశీలిస్తే నడిగడ్డ గద్వాలలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఐదు సార్లు పాగ పుల్లారెడ్డి, డీకే సత్యారెడ్డి కుటుంబంతో పోటీ పడ్డాడు. తర్వాత స్థానంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి డీకే కుటుంబాన్ని మూడు సార్లు ఢీకొట్టారు. ఇక నియోజవర్గ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ 38,686 డీకే.అరుణ గెలుపొందగా, 94 ఓట్ల అత్యల్ప మెజార్టీతో ఉప్పల గోపాల్‌రెడ్డి విజయం సాధించారు.

1957

డీకె సత్యారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెసు అభ్యర్థి పాగ పుల్లారెడ్డిపై 9,963 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

1962  

కృష్ణరామ్‌భూపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

1967

జీరెడ్డి తన సమీప ప్రత్యర్థి డీకె సత్యారెడ్డిపై 14,145 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

1972  

పాగ పుల్లారెడ్డి కాంగ్రెసు నుంచి బరిలోకి దిగగా డీకె సమరసింహారెడ్డి తండ్రి సత్యారెడ్డి బదులు తొలిసారి ఎన్నికల సమరంలోకి దిగారు. ఎన్నికల్లో పుల్లారెడ్డి 4,427 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు

1978

డీకె సత్యారెడ్డి జనతా పార్టీ నుంచి బరిలోకి దిగగా పాగ పుల్లారెడ్డి ప్రత్యర్థిగా కాంగ్రెసు పార్టీ నుంచి బరిలో నిలవగా 18,394 ఓట్లతో సత్యారెడ్డి విజేతగా నిలిచారు.

1980

ఎన్నికల్లో తండ్రి స్థానంలో డీకె సమరసింహారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రత్యర్థిగా మరోసారి పాగ పుల్లారెడ్డి 26,913 ఓట్లతో గెలుపొందారు.

1985

గద్వాల బరిలోకి తొలిసారిగా అయిజ మండలానికి చెందిన ఉప్పల గోపాల్‌రెడ్డి తెదేపా నుంచి బరిలో దిగారు. అయన ప్రత్యర్థిగా కాంగ్రెసు నుంచి డీకె సమరసింహారెడ్డి పోటీలో ఉన్నారు. అనూహ్యంగా డీకే బంగ్లా అధిపత్యానికి తెరదించుతూ కేవలం 91 ఓట్లతో ఉప్పల గోపాల్‌రెడ్డి గెలుపొందాడు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సమరసింహారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో చివరి ఏడాది న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుతో సమరసింహారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.

1989

డీకె సమరసింహారెడ్డి మరోసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలవగా ఆయన ప్రత్యర్థిగా ఎల్కూరు గ్రామానికి చెందిన వెంకట్రామారెడ్డి తెదేపా నుంచి బరిలో నిలిచారు. చివరికి సమరసింహారెడ్డి 10,454 ఓట్లతో విజయం సాధించారు.

1994

కుటుంబంలో విభేదాల కారణంగా సొంత అన్న సమరసింహారెడ్డిని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్‌గా డీకె భరతసింహారెడ్డి బరిలో నిలిచి అన్నపై 35,561 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందాడు. తర్వాత తెదేపా అనుబంధ సభ్యుడిగా ఐదేళ్లు కొనసాగారు.

1983

డీకె సమరసింహారెడ్డి కాంగ్రెసు నుంచి బరిలో నిలవగా మరోసారి ప్రత్యర్థిగా పాగపుల్లారెడ్డి పోటీ పడ్డాడు. 4,573 ఓట్లతో హోరాహోరీ పోరులో సమరసింహారెడ్డి విజయం సాధించారు.

1999

తెదేపా నుంచి బీసీ నినాదంతో టికెట్‌ దక్కించుకున్న గట్టు భీముడు తొలిసారి బరిలో నిలిచిన డీకె అరుణపై 4,547 ఓట్లతో గెలుపొంది. బంగ్లా అధిపత్యానికి సవాల్‌ విసిరారు.

2004

డీకె అరుణ సమాజ్‌వాది పార్టీ నుంచి బరిలో నిలిచారు. గట్టుభీముడు తెదేపా నుంచి బరిలో రెండోసారి పోటీ చేశారు. డీకె అరుణ 38,686 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెసు పార్టీకి అనుబంధ సభ్యురాలిగా కొనసాగారు.

2009

రెండోసారి డీకె అరుణ కాంగ్రెసు పార్టీ టికెట్‌ దక్కించుకొని గద్వాల బరిలో నిలిచారు. ప్రత్యర్థిగా సొంత మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెదేపా అభ్యర్థిగా ఢీకొన్నాడు 10,427 ఓట్ల అధిక్యంతో డీకే అరుణ విజేతగా నిలిచి తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు.

2014

ఎన్నికల్లో మరో సారి పోటీ అత్తా, అల్లుడు అయిన డీకె అరుణ, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మధ్యనే కొనసాగింది. తెదేపాలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి వారం రోజుల ముందు తెరాసలోకి చేరి టికెట్‌ దక్కించుకొని పోటీలో నిలిచారు. 8,260 ఓట్ల ఆధిక్యంతో అరుణ గెలుపొందారు. కృష్ణమోహన్‌రెడ్డి వరుసగా రెండోసారి ఓటమి చవి చూశారు.

2018

ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అత్తా, అల్లుడు మధ్య హోరాహోరీ పోరు సాగింది. తెరాస తరపున పోటీ చేసిన కృష్ణమోహన్‌రెడ్డి 27,902 ఓట్ల భారీ అధిక్యంతో కాంగ్రెసు అభ్యర్థి డీకే అరుణను ఓడించారు.

2023

నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరాస తరపున కృష్ణమోహన్‌రెడ్డి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుండగా ప్రత్యర్థిగా అలంపూరు నియోజకవర్గంలోని మానవపాడు నుంచి జడ్పీటీసీగా తెరాస తరపున ఎన్నికై జడ్పీ ఛైర్‌పర్సనైన సరిత అక్టోబరులో పార్టీ మారి కాంగ్రెస్‌ నుంచి రంగంలోకి దిగారు. ఈసారి బరి నుంచి డీకే అరుణ తప్పుకున్నారు. భాజపా తరఫున బల్గెర శివారెడ్డిని బరిలో దింపాలని అధిష్ఠానానికి సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని