logo

హామీలు అమలు చేయని వారు.. కాంగ్రెస్‌పై విమర్శలా?

రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని భారాస నాయకులు.. నాలుగు నెలల ప్రజాపాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 03:05 IST

మంత్రి జూపల్లి కృష్ణారావు

మల్లాయిపల్లిలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని భారాస నాయకులు.. నాలుగు నెలల ప్రజాపాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని మల్లాయిపల్లి, చింతకుంట, దొండాయిపల్లి, దావాజిపల్లి, అన్నారం, పాన్‌గల్‌ గ్రామాల్లో సోమవారం మంత్రి పర్యటించారు. గ్రామస్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ పాలనలో రూ.పది ఖర్చు అయ్యే పనికి రూ.వందలు ఖర్చు చేసి ప్రజాసొమ్ము వృథా చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు బంగారు పళ్లెంలో పెట్టించామని ప్రగల్భాలు పలికే భారాస నాయకులు.. ఆ పళ్లెంలో అప్పులు ఎన్ని ఉన్నాయో కూడా ప్రజలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజాపాలన సాగిస్తోందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేసి చూపించామని గుర్తుచేశారు. త్వరలోనే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి లోక్‌సభ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకుందామని పిలుపు నిచ్చారు.

భారాస చచ్చిన పాములాంటిది : మల్లు రవి

భారాస ప్రస్తుతం చచ్చిన పాములాంటిదని నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి డా.మల్లురవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాన్‌గల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల చేతిలో పాము చచ్చినట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారాసను చంపారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే లిక్కర్‌స్కాంలో కవిత జైలుకు వెళ్లారని, త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు వెల్లడం ఖాయమన్నారు. దేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడితే భారాతరాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కూడా ధనికులకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏవిధంగా మార్పు తెచ్చారు దేశంలో కూడా అదే తరహాలో మార్పు తీసుకొద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు హైమావతి, రవికుమార్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాముయాదవ్‌, రంగినేని జగదీశ్వరుడు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని