logo

వెన్నుపోటు తప్ప పేటకు చేసిందేమిటి?

నారాయణపేటలోనే పుట్టి పెరిగానని చెబుతున్న డీకే అరుణ ఈ జిల్లాకు ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా? అంటూ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ ఎంపీˆ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 16 Apr 2024 03:17 IST

డీకే అరుణపై కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి విమర్శలు

నారాయణపేట, పేట పాతబస్టాండ్‌, న్యూస్‌టుడే : నారాయణపేటలోనే పుట్టి పెరిగానని చెబుతున్న డీకే అరుణ ఈ జిల్లాకు ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా? అంటూ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ ఎంపీˆ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ఒక్క ప్రాజెక్టుకైనా అనుమతి తెచ్చారా అంటూ నిలదీశారు. దొరసాని అని తాను వ్యాఖ్యానిస్తే ఆమె ఎందుకు మండిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఆమె ముమ్మాటికీ దొరసానేనని పునరుద్ఘాటించారు. బడుగు, బలహీనవర్గాలకు ఆమె వ్యతిరేకి అని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతపార్టీ నాయకులకే వెన్నుపోటు పొడిచి భారాసకు ఓట్లు వేయించారని దుయ్యబట్టారు.నారాయణపేట, కొడంగల్‌ తనకు రెండు కళ్లు వంటివన్నారు. ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని మూడు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.  దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దెదించిన దమ్మున్న నాయకుడు రేవంత్‌రెడ్డని కొనియాడారు. కేసీఆర్‌ కమిషన్ల కోసం జీవోనెం.69 రద్దుచేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారన్నారు.

రెండింతల మెజార్టీ ఇవ్వాలి: ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోనే మొదటి మున్సిపాల్టీ అయిన నారాయణపేటకు అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ కావాలని ఎమ్మెల్యే పర్నికరెడ్డి సీఎంకు విన్నవించారు. అసెంబ్లీ ఎన్నికల కన్నా రెండింతల మెజార్టీ  వంశీచంద్‌కు ఇవ్వాలని కోరారు.

  • గుడిపేరు, రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, పదేళ్లలో పేటకు ఏమి చేశారో ఒక్కసారి ఆలోచించాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కోరారు. . పేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకంతోపాటు రూ.4వేల కోట్లతో పనులు ప్రారంభించడం విశేషమన్నారు.
  • గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సీఎం దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే తాను  సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరకు వెళ్లి పలు సమస్యలు చెప్పానన్నారు. గత ఎన్నికల్లో మక్తల్‌లో డీకే అరుణ తన తమ్ముడిని గెలిపించేందుకు ప్రయత్నం చేశారన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ దేశంలో మతతత్వ పార్టీలకు పాలించే హక్కులేదన్నారు.
  • ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సీఎం అయిన 120 రోజుల్లోనే అన్ని వర్గాల ప్రజల్లో కాంతిని నింపారన్నారు. భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక్క అక్షరం కూడా తెలంగాణ అభివృద్ధి విషయం ప్రస్తావించలేదన్నారు. మాదిగల ఎబీసీˆడీ వర్గీకరణపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. పేట నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి కుంభం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ జీవోనెం.69 అమలుచేసి సీఎం రేవంత్‌రెడ్డి మరో కాటన్‌దొరగా గుర్తింపు పొందారన్నారు. పీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్‌ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 4లక్షల మంది ముదిరాజ్‌లు ఉన్నారని, వారంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలంతా రేవంత్‌రెడ్డి వెంట నడవాలన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని