logo

ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే జలదీక్ష

నడిగడ్డ ప్రజలకు ప్రస్తుతం 15 రోజులకు సరిపడా మాత్రమే తాగునీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆ తరువాత ఇబ్బందులు పడతారని లెక్కలు వేసుకుని ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు జలదీక్ష చేపట్టినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 03:32 IST

జలదీక్షలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, భారాసా నాయకులు, కార్యకర్తలు

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నడిగడ్డ ప్రజలకు ప్రస్తుతం 15 రోజులకు సరిపడా మాత్రమే తాగునీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆ తరువాత ఇబ్బందులు పడతారని లెక్కలు వేసుకుని ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు జలదీక్ష చేపట్టినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గద్వాల పాత బస్టాండ్‌ వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సోమవారం దీక్ష చేపట్టారు. దీక్షకు మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపూర్‌ డ్యాం నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయించడానికి ప్రభుత్వం తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. భారాస అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అబద్దపు ప్రచారాలతో మోసం కాంగ్రెస్‌ పార్టీని, మరోసారి నమ్మి మోసపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదన్నారు. రాబోయే ఎన్నికలు నిజానికి, అబద్దానికి నడుమ జరుగుతున్నాయని, ప్రజలు నిజంవైపు నిలబడతాదని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వాత పెట్టాలన్నారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో దీక్షను విరమింప చేశారు. అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, నాయకులు వెంకట్రాములు, కృష్ణారెడ్డి, జగదీశ్వరరావు, విజయ్‌కుమార్‌, రామన్‌గౌడతో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దీక్షకు హాజరైన భారాస నాయకులు, ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని