logo

దశాబ్దాల కల నెరవేరదేమి?

ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్‌ ఉంది.

Published : 30 Apr 2024 05:46 IST

న్యూస్‌టుడే, నాగర్‌కర్నూల్‌ 

బిజినేపల్లి మండలం వట్టెంలో 1994లో ఏర్పాటైన నవోదయ విద్యాలయం

ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఉమ్మడి జిల్లాలో బిజినేపల్లి మండలం వట్టెంలో 1994లో నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత ముప్పై ఏళ్లుగా కొత్త విద్యాలయాల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు. ఉమ్మడి జిల్లాలో నవోదయ విద్యాలయం (వట్టెం), కేంద్రీయ విద్యాలయం ఒకటి (మహబూబ్‌నగర్‌) చొప్పున మాత్రమే ఉన్నాయి. నవోదయ విద్యాలయంలో 80 సీట్లు మాత్రమే ఉంటాయి. అందులో సీటు సంపాదించేందుకు ఏటా పది వేల మందికిపైగా విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తుంటారు. సీట్లు రాని వారంతా ప్రైవేట్‌ బడి లేదా హైదరాబాద్‌లో అధికంగా డబ్బులు వెచ్చించి కార్పొరేట్‌ సంస్థల్లో చేరాల్సి వస్తోంది. ఆర్థిక స్థోమత లేని వారు గ్రామీణా ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. కేంద్ర విద్యాలయాలు జిల్లాకొకటి చొప్పున ఏర్పాటైతే ఎక్కువ మంది విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ప్రతిసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థులు వీటిపై హామీలు ఇస్తున్నా.. అమలు కావడం లేదు.

ప్రతిపాదనలకే పరిమితం.. : ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని కలెక్టర్‌ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు పంపిస్తున్నా.. ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల నుంచి గతంలోనూ ప్రతిపాదనలు పంపించారు. నాగర్‌కర్నూల్‌లో ఈ విద్యాలయం ఏర్పాటుకు రెండు చోట్ల స్థలాలను పరిశీలించి కేటాయించారు. వరుసగా మూడేళ్లుగా ప్రతిపాదనలు వెళ్లినా.. విద్యాలయం మాత్రం మంజూరు కావడం లేదు. రెండేళ్ల క్రితం ఈ ఏడాది అద్దె భవనంలో ప్రారంభం కానుందని హడావుడి చేసినా.. ఉసూరనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే వీటిని సాధించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థులు అనేక హామీలు గుప్పిస్తున్నారు. కేంద్ర విద్యాలయాల సాధనకు స్పష్టమైన హామీనిస్తూ.. చిత్తశుద్ధితో పోరాడాలని ప్రజలు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని