logo

కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు: భారాస

రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్‌ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్‌కర్నూల్‌ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Published : 30 Apr 2024 05:47 IST

గద్వాలలో ప్రచారం చేస్తున్న భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్‌ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్‌కర్నూల్‌ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఉదయం గద్వాల మినీ స్టేడియంలో మార్నింగ్‌ వాకర్స్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆ పక్కనే ఉన్న పశువుల సంతలో జీవాల క్రయ విక్రయదారులతో ముచ్చటించారు. కొత్తబస్టాండ్‌ ఎస్‌బీఐ సమీపంలోని టీ స్టాల్‌ వద్ద చాయ్‌పేచర్చాలో పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ.. చేతకాక ముఖ్యమంత్రి దేవుళ్లపై ఓట్టు వేసి పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తానని దేవుని సాక్షిగా అంటూ ప్రజల్లో సెంటిమెంటు రాజేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారాస హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ వందరోజుల పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 24 గంటల విద్యుత్తు సరఫరాలో లోపాలు, ధాన్యంపై రూ.500 బోనస్‌ ఇవ్వడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసిన కేసీఆర్‌ నాయకత్వంలోని భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌కమార్‌ను గెలిపించాలని కోరారు. నాగర్‌దొడ్డి వెంకట్రామలు, గడ్డం కృష్ణారెడ్డి, ఎన్నికల ఇన్‌ఛార్జి ఇంతియాజ్‌, పుర వైస్‌ ఛైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, దౌలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని