logo

పదిలో బాలికలదే పైచేయి

జిల్లాలోని పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌, వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో కలిపి మొత్తం 10,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు.

Published : 01 May 2024 07:02 IST

ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం

నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద పదోతరగతి విద్యార్థినులు

 కందనూలు, న్యూస్‌టుడే : జిల్లాలోని పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌, వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో కలిపి మొత్తం 10,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 91.57 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయిలో 23వ స్థానం సాధించగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో బాలురు 5,205 మందికి గాను 4,695 మంది పాసయ్యారు. బాలికలు 5,302 మంది పరీక్షలు రాయగా 4,926 విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. 2022-23 విద్యా సంవత్సరంలో జిల్లాలో 10,545 మంది వార్షిక పరీక్షలకు హాజరు కాగా 9,582 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 90.87 శాతం నమోదైంది. దీంతో రాష్ట్ర స్థాయిలో 12వ స్థానం సాధించగా ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానం సాధించారు. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా, రాష్ట్ర స్థాయి జీపీఏల్లోనూ వెనుకబడిపోయారు. జిల్లాలోని ప్రభుత్వ విభాగ పరిధిలోని 10 పాఠశాలల్లో 16 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో 42 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. జిల్లాలో మొత్తం 58 మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు.

 కస్తూర్బా విద్యార్థినుల సత్తా.. : జిల్లాలో మొత్తం 20 కస్తూర్బా విద్యాలయాల పరిధిలో 780 మంది విద్యార్థినులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయగా 726 మంది ఉత్తీర్ణత సాధించారు. 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. అమ్రాబాద్‌, బల్మూరు, పదర, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, ఉప్పునుంతలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. చారకొండ కేజీబీవీలో ఇంగ్లిష్‌ మీడియంలో వరలక్ష్మి 9.7, ఊర్కొండ కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమం చదువుతున్న విజయలక్ష్మి 9.8 మార్కులు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని