logo

గర్భంలోనే శిశువు మృతి

నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది.

Published : 07 May 2024 03:08 IST

వైద్యురాలి నిర్లక్ష్యమంటూ బంధువుల ఆరోపణ

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గట్టు మండలం బోయలగూడెం గ్రామానికి చెందిన సుజాత(26), వీరేష్‌ దంపతులకు ఇద్దరు ఆడ సంతానం. ప్రస్తుతం 9 నెలల గర్భిణి అయిన సుజాత ఆస్పత్రిలోనే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 1న జిల్లా ఆస్పత్రికి వెళ్లగా ప్రసవ సమయం ఇంకా ఉందని వైద్యులు చెప్పగా తిరిగి వెళ్లిపోయింది. సోమవారం పురిటినొప్పులు రావడంతో వారు గట్టు పీహెచ్‌సీకి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భంలో ఉన్న శిశువుకు రక్తప్రసరణ తక్కువగా ఉందని చెప్పడంతో వైద్యుల సలహా మేరకు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. అయితే గర్భంలోనే మగ శిశువు మృతిచెందాడు.

ఆపరేషన చేసి ఉంటే: వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన సమయానికి రాకపోవడంతో సిస్టర్లే వైద్యానికి ఉపక్రమించారని బంధువులు ఆరోపించారు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు పరీక్షించి సాధారణ కాన్పు చేశారని, అప్పటికే కడుపులోనే మగశిశవు మృతిచెందాడని, వెంటనే ఆపరేషన్‌ చేసి ఉంటే బతికేవాడన్నారు. చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.

రక్తప్రసరణ ఆగిపోవడంతో..: గర్భిణికి రక్తపోటు అధికం కావడంతో కడుపులో ఉన్న శిశువుకు రక్తప్రసరణ ఆగిపోవడంతోనేే మృతిచెందాడని జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు కిశోర్‌కుమార్‌ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు చనిపోలేదన్నారు. ఏవైనా అనుమానం ఉంటే ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని వివరించారు. సంఘటన బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

దారుణంగా చూస్తున్నారు..: ఆసుపత్రికి వచ్చి రోగులను వైద్యులు కొందరు దారుణంగా చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణి కడుపులో శిశువు చనిపోయాడని తెలుసుకున్న ఆయన సోమవారం ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.  

వైద్యురాలికి తాఖీదు: శిశువు మృతి ఘటనపై వైద్యురాలికి తాఖీదు జారీచేసినట్టు పర్యవేక్షకుడు కిషోర్‌ చెప్పారు. ప్రసవం చేసే విషయంలో వైద్యురాలు పట్టించుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెండు రోజుల్లోగా ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా తాఖీదు జారీ చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని