logo

సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?

పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

Updated : 07 May 2024 06:27 IST

ఓటర్లపై మండుటెండల ప్రభావం పడకుండా జాగ్రత్తలు
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌
సమయం పొడిగింపు  
పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలపై అధికారుల దృష్టి

  • మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో 1,937, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 2,067 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో కనీసం 20 శాతం కేంద్రాలను రిటర్నింగ్‌, సెక్టోరియల్‌ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడున్న కనీస సౌకర్యాలపై ఆరా తీశారు.
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఆశా కార్యకర్తల ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉండాలి. ఈ శిబిరాల్లో మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.
  • ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలి. ప్రధానంగా క్యూలో నిలబడితే వారికి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి మంచినీటిని అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండలో నిలబడకుండా షామియానాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద గదుల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు ఉండేలా చూస్తున్నారు.
  • కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వాలంటరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీళ్లు ప్రధానంగా వృద్ధులు, వికలాంగులకు అవసరమైన సేవలు అందించనున్నారు. ఎక్కవగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఉన్న గదుల్లో పోలింగ్‌ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎండల ప్రభావం ఓటింగ్‌ శాతంపై ఉంటుందన్న ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. రిటర్నింగ్‌ అధికారులు ఓటింగ్‌ శాతం తగ్గకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రిటర్నింగ్‌ అధికారులకు ఎండల ప్రభావం పోలింగ్‌పై పడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎండల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? పోలింగ్‌ రోజు ఏం చర్యలు తీసుకోవాలి? పోలింగ్‌ కేంద్రాల వద్ద వడదెబ్బ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది. సాధారణంగా పోలింగ్‌ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఎండల నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని మరో గంట పొడిగించారు.

సార్వత్రికంలో తగ్గుతున్న ఓటింగ్‌..: పాలమూరులోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎన్నికలతో పోల్చుకుంటే ఎంపీ ఎన్నికలకు ఓటింగ్‌ శాతం తగ్గుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభ స్థానాల పరిధిలో మొత్తం 80.52 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజవకర్గం పరిధిలో కేవలం 65.30 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. సుమారు 15.22 శాతం ఓటింగ్‌ తగ్గింది. నాగర్‌కర్నూలు స్థానం పరిధిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం పోలింగ్‌ నమోదు కాగా లోక్‌సభ ఎన్నికల్లో 62.51 శాతం ఓటింగ్‌ జరిగింది. ఈ స్థానం పరిధిలోని 13.16 శాతం ఓటింగ్‌ తగ్గింది. గతేడాది నవంబరు 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 79.89 శాతం, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 80.95 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి వివిధ కారణాలతో ఓటింగ్‌ శాతం తగ్గుతోంది. ఈ ఏడాది ఎండ తీవ్రంగా ఉండటంతో గతంతో పోలిస్తే మరింత ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన మూడు విడత ఎన్నికల్లో ఎండల ప్రభావం ఓటింగ్‌పై పడటంతో ఈ నాలుగో విడతలో ఆ పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.


ఇతర ప్రాంతాల నుంచి రావాలంటే..

పాలమూరులో వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. ముంబయి, ఫుణె, భీమండితోపాటు హైదరాబాద్‌లో నివాసం ఉంటారు. వీరంతా  ఎన్నికల సమయంలో తమ గ్రామాలకు వచ్చి ఓటేసి వెళ్తారు. శాసనసభ సభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ స్థానిక నేతలు ఈ ఓటర్లపై దృష్టి సారిస్తారు. ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎండల్లో దూరప్రాంతాల నుంచి రావడం ఇబ్బందిగా మారుతుండటంతో వలస ఓటర్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పరిధిలోని జడ్చర్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో మాత్రమే 70 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. మిగతా ఐదు నియోకవర్గాల్లో 60 శాతం లోపు ఉంది. నాగర్‌కర్నూల్‌ పరిధిలో కొల్లాపూర్‌లో 56.16 శాతం, అచ్చంపేటలో 58.92 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ప్రాంతాల్లో ప్రతి గ్రామం నుంచి సుమారు 100-250 వరకు ఓటర్లు హైదరాబాద్‌లోని వివిధ పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఎండల్లో వీరంతా తిరిగి గ్రామాలకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధికారులు మాట్లాడుతూ ఎండల ప్రభావం పడకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో ఓటింగ్‌ శాతం పెరగడంపై దృష్టి సారించినట్లు వివరించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటింగ్‌కు వస్తే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని