logo

నాటారు.. నరికారు

హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొన్ని చోట్ల ముందుచూపు లేకుండా విద్యుత్తు లైన్ల కింద నాటినవి నరికివేతకు గురవుతున్నాయి.

Published : 09 May 2024 05:50 IST

వనపర్తి మండలం అంకూరు గ్రామ శివారులో నరికివేతకు గురైన చెట్లు

వనపర్తి న్యూటౌన్‌, అమరచింత, న్యూస్‌టుడే : హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొన్ని చోట్ల ముందుచూపు లేకుండా విద్యుత్తు లైన్ల కింద నాటినవి నరికివేతకు గురవుతున్నాయి. కొమ్మలకు తీగలు తగిలి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని 15 అడుగుల ఎత్తులో పెరిగిన చెట్లను నరికివేస్తున్నారు.

  • వనపర్తి మండలంలోని కడుకుంట్ల, అంకూరు, పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయపల్లి, శ్రీరంగపూర్‌, అమరచింత మండలాల్లోని పలు గ్రామాల్లో హరితహారం చెట్లను నరికివేశారు.
  • అమరచింత పురపాలక సంఘం వారు విద్యుత్తు ఉపకేంద్రం నుంచి పీజేపీ మస్తీపూర్‌ రహదారి మలుపు వరకు, అమరచింత - మరికల్‌ ప్రధాన రహదారి వెంట నాలుగు కి.మీ. మొక్కలు నాటించారు. వీటిపైన విద్యుత్తు లైన్‌ ఉండటంతో పెరిగిన చెట్ల కొమ్మలు తీగలకు తగులుతుండటంతో వాటిని నరికివేశారు.కొట్టిన కొమ్మలను తొలగించకపోవడంతో ఈదురు గాలులకు అవి రహదారి పైకి వచ్చి పడుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చొన్ని చోట్ల నిప్పుపెడుతున్నారు.
  • హరితహారంలో భాగంగా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్‌ను ఆయా గ్రామపంచాయతీలు, పురపాలికలు నిర్వహిస్తున్నాయి. ఏటా జిల్లా వ్యాప్తంగా సుమారు 300 కి.మీ. మేర పొడవైన రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నారు. ఉపాధి హామీ నిధులతో కంచె వేసి, నీళ్లు పోసి సంరక్షిస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా నాటడంతో మొక్కలు చెట్లుగా పెరిగాక నరికివేతకు గురవుతున్నాయి.
  • రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది మధ్య సమన్వయలోపంతో ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు పథకం లక్ష్యం నీరుగారుతోంది. రహదారి పక్కన ఎంత దూరంలో నాటాలి.. విద్యుత్తు లైన్లు ఉన్నాయా? లేవా? అవి గమనించకుండా కనీస అవగాహన లేకుండా మొక్కలు నాటారు.
  • నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి మొక్కల సంఖ్యను కాగితాల్లో చూపడానికి మాత్రమే సంబంధిత అధికారులు పనులు చేసున్నారన్న విషయం స్పష్టమవుతుంది. ముందు చూపు లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పదో విడత హరితహారంలోనైనా సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన మొక్కలు నాటి పర్యావరణ హితానికి దోహదపడాలని ప్రజలు కోరుతున్నారు.

అవసరమైనవి నాటుతాం: రహదారుల వెంట నాటిన మొక్కలను విద్యుత్తు అధికారులు వైర్లకు తాకుతున్నాయని తొలగిస్తున్నారు. చెట్లను తొలగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఏపుగా పెరిగే మొక్కలు కాకుండా అనుకూలమైన రెయిన్‌ట్రీ, సీమతంగేడు, కానుగ వంటి మొక్కలను నాటుతాం.

నాగేంద్రం, ఇన్‌ఛార్జి పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని