logo

దొంగల హల్‌చల్‌..

పట్టణాలు, గ్రామాల్లో దొంగలు కొత్త పంతాకు తెరదీసి చోరీలకు పాల్పడుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు మాత్రమే దొంగతనాలకు పాల్పడేవారు. ఇప్పుడు పట్టపగలు సైతం చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు.

Published : 09 May 2024 05:52 IST

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు

నారాయణపేట, న్యూస్‌టుడే : పట్టణాలు, గ్రామాల్లో దొంగలు కొత్త పంతాకు తెరదీసి చోరీలకు పాల్పడుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు మాత్రమే దొంగతనాలకు పాల్పడేవారు. ఇప్పుడు పట్టపగలు సైతం చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఠాలతో చేతులు కలిపి చోరీలు చేస్తూ అందినకాడికి దోచుకెళ్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి సులువుగా తమ పనికానిచ్చేస్తున్నారు. ఎక్కువగా తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని నగలు, నగదు దోచుకెళ్తున్నారు. జిల్లాలో వరుస దొంగతనాలపై న్యూస్‌టుడే కథనం..

జిల్లాలో మచ్చుకు కొన్ని : నెల కిందట కోస్గి పట్టణంలో ఓ కుటుంబం ఇంటికి తాళంవేసి మరో గ్రామానికి వెళ్లగా దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో భద్రపర్చిన మూడు తులాల బంగారం, రూ.లక్షకు పైగా నగదు ఎత్తుకెళ్లారు. మరో ఉద్యోగి ఇంట్లోనూ తాళం పగులగొట్టి పట్టపగలే ఎవరూలేని సమయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడి రూ.లక్ష నగదుతోపాటు విలువైన వస్తువులు దోచుకెళ్లారు. చోరీ చేస్తూ గ్రామస్థులకు పట్టుబడిన దొంగను విచారించి పోలీసులు కొంత వరకు బంగారం, నగదును రికవరీ చేశారు.

  • మక్తల్‌ పట్టణంలోని ఓ ఉద్యోగి ఇంట్లో నెల కిందట చోరీ జరిగింది. వేసవికాలం కావడంతో ఓ కుటుంబం ఇంటి తలుపులు మూయకుండా ఆరుబయట నిద్రించారు. దొంగలు అదనుచూసి ఇంట్లో చొరబడి దాదాపు 12 తులాల బంగారం దోచుకెళ్లారు. మక్తల్‌ మండలంలోని కాట్రేవుపల్లి గ్రామంలో పక్క పక్కనే ఉన్న రెండు ఇళ్లలో రూ.5లక్షల వరకు దొంగలు దోచుకెళ్లారు.
  • నర్వ మండలంలో ఇళ్లలో దొంగతనాలకు బదులుగా కోయిల్‌సాగర్‌ కాలువలో పంటపొలాలకు నీరుపెట్టేందుకు రైతులు ఏర్పాటుచేసుకున్న బోరుమోటార్లు, స్టార్టర్లు, కేబుల్‌వైర్లు దొంగిలించుకెళ్తున్నారు. రైతులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా నేటికీ దొంగల ఆచూకీ మాత్రం లభించలేదు. రైతులకు రూ.వేలల్లో నష్టం జరుగుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • దామరగిద్ద మండలం వత్తుగుండ్లలో ఇంటికి తాళంవేసి కిటికీలకు గ్రిల్స్‌ ఏర్పాటుచేయకపోవడంతో పట్టపగలు దొంగలు చోరీకీ పాల్పడ్డారు. పెద్దఎత్తున ఆభరణాలతోపాటు నగదును దొంగిలించారు.
  • మరికల్‌ పట్టణంలోని రాములు ఇంట్లో మూడు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి 40 తులాల బంగారం, రూ.10లక్షలు నగదు దోచుకెళ్లారు. పోలీసు అధికారులు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
  • నాలుగు రోజుల కిందట పేటలో ఓ మద్యం దుకాణం, సూపర్‌మార్కెట్లో దొంగలు పడ్డారు. సూపర్‌ మార్కెట్లో విలువైన సామగ్రి, నగదును అందినకాడికి దండుకుని ఎత్తుకెళ్లారు. మద్యం దుకాణంలో దాదాపు రూ.50వేల నగదును దోచుకెళ్లారు.

గస్తీ చేస్తున్నా.. : జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌, కోస్గి, మరికల్‌ పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో పోలీసులు వారి వాహనాలపై గస్తీ చేపడుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడంలేదు. పట్టణాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు పట్టుబడటం లేదు. పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకొని చోరీలకు గురి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అప్రమత్తత అవసరం : దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితులు కనిపిస్తే తక్షణమే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి తాళంవేసి కిటికీ తలుపులు తీసి ఉంచరాదు. ఊరు వదిలివెళ్లిన వారు తాళాలువేసి పోలీసులకు సమచారం ఇవ్వాలి. పోలీసుల గస్తీ పెంచి చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. నగలు, పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంకుల్లో భద్రతపర్చుకోవడం మంచిదని కోస్గి, మక్తల్‌ సీఐలు సోమునర్సయ్య, చంద్రశేఖర్‌ చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు