logo

ఆ దేశాల్లో ఓటు వినియోగం తప్పనిసరి

పోలింగ్‌ శాతం పెంచేలా ఎన్నికల సంఘం అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పెద్దగా స్పందన ఉండటం లేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ మరింత తక్కువగా ఉంటోంది.

Published : 09 May 2024 06:08 IST

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పోలింగ్‌ శాతం పెంచేలా ఎన్నికల సంఘం అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పెద్దగా స్పందన ఉండటం లేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ మరింత తక్కువగా ఉంటోంది. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎన్నికల సంఘం ఒక గంటపాటు సమయం కూడా పొడిగించింది. దీన్ని సద్వినియోగం చేసుకునేలా చైతన్యం చేయాల్సిన అవసరముంది. ఓటుహక్కు వినియోగంపై కొన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాలు చేయడంతో పోలింగ్‌ శాతం పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుంటే జరిమానా కూడా విధిస్తారు. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాధ్యతగా ఓటేస్తారు. చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏమాత్రం తేడా కనిపించినా ఆయా దేశాల పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్‌ ట్యాక్స్‌ పేయర్స్‌’ అంటూ ఉద్యమాలు చేపడతారు. భారత్‌లో కూడా అలాంటి చట్టాలు ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సింగపూర్‌ : ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలు తెలియజేస్తూ పూర్తి ఆధారాలు సమర్పిస్తేనే ఓటుహక్కును పునరుద్ధరిస్తారు. ఇక్కడ గరిష్ఠంగా 92 శాతం వరకు పోలింగ్‌ నమోదైంది.

ఆస్ట్రేలియా : జరిమానా విధానం ఆస్ట్రేలియాలో అమలులో ఉంది. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలి. ఇక్కడ 96 శాతం వరకు పోలింగ్‌ నమోదవుతోంది.

గ్రీస్‌ : ఇక్కడ ఓటు వేయని వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94 శాతం వరకు ఓటింగ్‌ నమోదవుతోంది.

బెల్జియం : ఇక్కడ వరుసగా నాలుగు సార్లు ఓటేయకపోతే రూ.4వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా విధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. 96 శాతం వరకు పోలింగ్‌ నమోదు కావటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని