logo

తాగునీటికి ఊరట!

నారాయణపూర్‌ జలాశయం నుంచి జూరాలకు 1.90 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు కాస్త ఊరటనిచ్చే అంశమే.

Updated : 09 May 2024 06:37 IST

నారాయణ్పూర్‌ నుంచి జూరాలకు 1.90 టీఎంసీల విడుదల

జూరాల జలాశయంలో అడుగంటిన నీరు

గద్వాల, న్యూస్‌టుడే: నారాయణపూర్‌ జలాశయం నుంచి జూరాలకు 1.90 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు కాస్త ఊరటనిచ్చే అంశమే. ఇప్పటికే జూరాల దాదాపు అడుగంటిపోగా మరో 0.04 టీఎంసీల నీటిని మాత్రమే తోడుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం కొద్దికాలం పాటు తాగునీటి అవసరాలు తీర్చనుంది.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో: ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగు, సాగునీటి వనరులకు ఆధారమైన జూరాలలో ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీలో క్రాప్‌హాలీడే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నీటినిల్వ తాగునీటికి కూడా సరిపడక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కటకట నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తుల మేరకు కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక జలవనరుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 1.90 టీఎంసీల నీటిని దిగువకు జూరాల వైపు నదిలోకి విడుదల చేయనున్నట్లు మంగళవారం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు జూరాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. కాగా నారాయణ్‌పూర్‌ నుంచి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ధర్మల్‌ విద్యుత్‌ అవసరాల నిమిత్తం గుర్జాపూర్‌ బ్యారేజీ వరకు నీటిని వదులుతోంది. అక్కడి నుంచి జూరాలకు నీటిని విడుదల చేశారని, అది జూరాల చేరటానికి 48 గంటల సమయం పట్టనుందని జూరాల డ్యాం విభాగం ఈఈ జుబేర్‌ అహ్మద్‌ తెలిపారు.

ఒక టీఎంసీ అయినా చేరేనా..: నారాయణపూర్‌ జలాశయంలో ప్రస్తుతం 20.30 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. కేవలం తాగునీటి అవసరాలు, ధర్మల్‌ విద్యుదుత్పత్తి కోసమే వీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు వదులుతున్న నీటి సామర్థ్యం 1.90 టీఎంసీల అయితే బ్యారేజీలు, అడ్డుకట్టలు దాటుకొని జూరాల నీరు రావాల్సి ఉంటుంది. దిగువకు వదిలిన నీటిసామర్థ్యం తక్కువగా ఉండటంతో జూరాలకు కనిష్ఠ ప్రవాహమే చేరనుంది. ఒక టీఎంసీకన్నా తక్కువ నీరు జూరాలకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. జూరాల జలాశయంలో బుధవారం నాటికి నీటినిల్వ 2.70 టీఎంసీల మేర ఉంది. అందులో తాగునీటి అవసరాల కోసం నీటివినియోగ సామర్థ్య నిల్వ  0.043 టీఎంసీలు మాత్రమే.

అదనంగా రెండు టీఎంసీలు విడుదల చేయిస్తే: నారాయణ్‌పూర్‌ జలాశయం నుంచి దిగువకు వదులుతున్న 1.90 టీఎంసీల నీటికి అదనంగా మరో 2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూరాలపై ఆధార పడిన తాగునీటి పథకాలకు జూన్‌ వరకు ఇబ్బంది ఉండదని జూరాల అధికారులంటున్నారు. అయితే దీనిపై పార్లమెంటు ఎన్నికల తర్వాత మరోసారి మన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం, సాగునీటి శాఖ అధికారులు సంప్రదింపులు జరిపి చర్యలు చేపడితే సాధ్యమవుతుందని వారంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు