logo

అధిక స్థానాల్లో గెలిస్తే రాష్ట్ర రాజకీయాలనే మారుస్తాం

లోకసభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో భారాస అభ్యర్థులు గెలిస్తే, ఆరు నెలల్లో కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని, మన జీవితాలను బాగుచేస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న గద్వాల జిల్లాను నడిగడ్డ పౌరుషం యువత నిలబెట్టుకుంటుందని తనకు నమ్మకం ఉందన్నారు.

Updated : 09 May 2024 06:36 IST

గద్వాల రోడ్‌షోలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌, చిత్రంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోకసభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో భారాస అభ్యర్థులు గెలిస్తే, ఆరు నెలల్లో కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని, మన జీవితాలను బాగుచేస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న గద్వాల జిల్లాను నడిగడ్డ పౌరుషం యువత నిలబెట్టుకుంటుందని తనకు నమ్మకం ఉందన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు మేము అందిస్తే, కాంగ్రెస్‌ నాయకులు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంటు బోర్డుకు అప్పగిస్తూ లేఖలు రాశారని ఎద్దేవా చేశారు. జూరాల నుంచి జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి జలదీక్ష చేస్తే తప్ప స్పందించలేదన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒక పక్క కేసీఆర్‌ను తిడుతారు, మరో పక్క ఆరు గ్యారంటీల అమలు కోసం తేదీలను మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లక్షన్నర పెళ్లిళ్లు జరిగాయని, ఆ లెక్కన మా ఆడపడుచులకు లక్షన్నర తులాల బంగారం సీఎం బకాయి పడ్డారని దాని గురించి అడిగితే దేవుళ్ల మీద ఓట్లు వేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.

అమరుల ఆశయాల సాధనకు..: భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికలు తెలంగాణ అమరుల త్యాగానికి, పచ్చి అబద్దాలకు మధ్య జరుగుతున్న యుద్ధం లాంటివని ప్రజలు అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను గెలిపించాలన్నారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటు, రిజర్వేషన్లు రద్దు చేయడానికి వెనుకంజ వేయదని ఆరోపించారు. కేటీఆర్‌ ధరూర్‌మెట్టు నుంచి పాత బస్టాండ్‌ వరకు నిర్వహించిన రోడ్డుషోలో ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. గాంధీచౌక్‌, పాత బస్టాండ్‌ల వద్ద ఆయనకు గజమాలతో భారాస శ్రేణులు సత్కరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని