logo

పాలమూరులో ప్రచార హోరు

షెడ్యూల్‌ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించలేదు. మహబూబ్‌నగర్‌కు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ, నాగర్‌కర్నూల్‌కు గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌ వచ్చారు

Published : 10 May 2024 04:11 IST

షెడ్యూల్‌ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించలేదు. మహబూబ్‌నగర్‌కు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ, నాగర్‌కర్నూల్‌కు గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌ వచ్చారు. షెడ్యూల్‌ రాకముందు నాగర్‌కర్నూల్‌కు ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తర్వాత అగ్రనేతలు ఎవరూ బహిరంగ సభలో పాల్గొని ప్రచారం నిర్వహించలేదు. మహబూబ్‌నగర్‌లో ఈసారి కమలం జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. మోదీ ప్రభంజనంలో మహబూబ్‌నగర్‌ స్థానంలో గెలిచి తీరుతామన్న ధీమాను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. నేడు మోదీ ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో ఆ ప్రభావం కచ్చితంగా ఓటర్లపై ఉంటుందని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో మోదీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.  

నేడు పేటకు ప్రధాని, మక్తల్‌కు సీఎం

 ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు జోరు పెంచారు. ప్రత్యర్థులపై విమర్శలతో ప్రసంగాల హోరు వినిపించనున్నారు. పాలమూరులో అగ్రనేతల పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నారాయణపేటలో ప్రధాని, అదే జిల్లా మక్తల్‌లో సీఎం ఎన్నికల ప్రచారం ఉంది. అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరిదీ ఒకే సమయంలో సభలు ఉండటంతో అందరి చూపు నారాయణపేటపై పడింది. ఓవైపు భాజపా మహబూబ్‌నగర్‌ను కంచుకోటగా భావించి  ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుని మరోసారి పాలమూరులో సత్తా చాటాలని భావిస్తున్నారు.
పోటాపోటీగా ఏర్పాట్లు..: అటు ప్రధాని మోదీ సభ.. ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయడానికి భాజపా, కాంగ్రెస్‌ పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. నారాయణపేటలోని మినీ స్టేడియంలో ప్రధాని సభ నిర్వహిస్తున్నారు. మక్తల్‌లోని కొత్తగార్లపల్లి రోడ్డులోని మైదానంలో సీఎం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు సభలకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి తమ బలాలను చాటుకోవాలని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కనీసం 25వేల మందికి తక్కువగా కాకుండా ప్రజల్ని తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. రెండు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నాయి. ఒకే జిల్లాలో అదీ కూడా కూతవేటు దూరంలోనే పీఎం, సీఎం పర్యటన ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మక్తల్‌లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార సభ ఉండటంతో ఆసక్తి నెలకొంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానాన్ని ముఖ్యమంత్రి  ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి విజయం కోసం సీఎం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కొడంగల్‌, మద్దూరు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, కొత్తకోటలో సీఎం పర్యటించారు. శుక్రవారం మక్తల్‌తోపాటు షాద్‌నగర్‌లో జరిగే ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొననున్నారు. షెడ్యూల్‌ వెలువడిన తర్వాత మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జడ్చర్ల మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేపట్టడంతో ఈ ఎన్నికపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తేటతెల్లమవుతోంది. మోదీ పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.    భాజపాను లక్ష్యంగా చేసుకునే మక్తల్‌, షాద్‌నగర్‌లో రేవంత్‌ ప్రసంగం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని