logo

ఒకే నియోజకవర్గం.. మూడుసార్లు మార్పు

రెండు జిల్లాల పరిధిలో ఉన్న దుబ్బాక నియోజకవర్గం.. మూడు సార్లు రూపాంతరం చెందింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖËర్‌రావు దుబ్బాకలోనే చదువుకున్నారు. పట్టణంలోని రామసముద్రం చెరువుకట్టపై కూర్చొని కేసీఆర్‌ పద్యాలు రాశారు.

Updated : 23 Oct 2023 04:37 IST

దుబ్బాక ప్రత్యేకం
న్యూస్‌టుడే, చేగుంట

రెండు జిల్లాల పరిధిలో ఉన్న దుబ్బాక నియోజకవర్గం.. మూడు సార్లు రూపాంతరం చెందింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దుబ్బాకలోనే చదువుకున్నారు. పట్టణంలోని రామసముద్రం చెరువుకట్టపై కూర్చొని కేసీఆర్‌ పద్యాలు రాశారు. నియోజకవర్గం ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నా మెదక్‌ జిల్లాలోనూ విస్తరించి ఉంది.

ముందుగా రాజగోపాల్‌పేట

మొదట ఈ నియోజకవర్గం 1952లో ప్రస్తుతమున్న నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేటగా ఉండేది. ఒకసారి మాత్రమే ఇక్కడి నుంచి శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1957లో దొమ్మాటగా మార్పు చేశారు. దౌల్తాబాద్‌ మండలంలో ఉండే గ్రామం దొమ్మాట. నియోజకవర్గ కార్యకలాపాలు దుబ్బాకలోనే జరిగేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో దొమ్మాట పేరును దుబ్బాకగా చేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, తొగుట, రాయపోల్‌, అగ్బర్‌పేట-భూంపల్లి మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగి, మాసాయిపేట మండలాలు దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నాయి.

కాంగ్రెస్‌ 5, తెదేపా 4, భారాస 4

ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ ఐదు సార్లు విజయం సాధించింది. తెదేపా నాలుగు, భారాస నాలుగు సార్లు విజయం సాధించాయి. రెండు సార్లు స్వతంత్రులు, ఒక్కొక్కసారి పీడీఎఫ్‌, భాజపా విజయం పొందాయి. దాదాపుగా ప్రధాన పార్టీలకు ఓటర్లు పట్టం కట్టడం విశేషం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం దుబ్బాకయే. ఇక్కడ రెండు సార్లు ఉప ఎన్నిక జరిగింది. ఒకసారి భారాస(తెరాస), మరోసారి భాజపా గెలుపొందాయి.

విశేషాలు

  • చంద్రబాబునాయుడు హయాంలో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ హయాంలో తితిదే బోర్డు సభ్యుడిగా, శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా చేశారు.
  • భారాస హయాంలో సోలిపేట రామలింగారెడ్డి సైతం శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
  • సీఎం కేసీఆర్‌ చదువుకున్న పాఠశాలను అన్ని హంగులతో పునర్నిర్మించారు.
  • దేశంలో అతిపొడవైన 44వ జాతీయ రహదారి, సికింద్రాబాద్‌-ముథ్కేడ్‌ రైలు మార్గం ఈ నియోజకవర్గం గుండా వెళ్తోంది.
  • చేగుంటలో పరిశ్రమలు ఉండటంతో 12 రాష్ట్రాలకు చెందినవారు నివసిస్తున్నారు.

శాసనసభ్యులు

  • కె.వి.నారాయణరెడ్డి (1952, స్వతంత్ర, రాజగోపాల్‌పేట)
  • అనంతరెడ్డి (1957, పీడీఎఫ్‌)
  • ఖాజామొహినొద్దీన్‌ (1962, కాంగ్రెస్‌)
  • భీంరెడ్డి (1967, స్వతంత్ర)
  • రాంచంద్రారెడ్డి (1972, కాంగ్రెస్‌)
  • ఐరేని లింగయ్య (1978, 1983, కాంగ్రెస్‌)
  • డి.రాంచంద్రారెడ్డి (1985, తెదేపా)
  • చెరుకు ముత్యంరెడ్డి (1989, 1994, 1999, 2009, తెదేపా, కాంగ్రెస్‌)
  • సోలిపేట రామలింగారెడ్డి (2004, 2008, 2014, 2018, భారాస)

మాధవనేని రఘునందన్‌రావు (2020, భాజపా)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు