logo

ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి

సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ రోడ్‌షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

Published : 03 May 2024 01:41 IST

సీఎం రేవంత్‌

కార్నర్‌ మీటింగ్‌కు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

న్యూస్‌టుడే, సిద్దిపేట, సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట టౌన్‌, కొండపాక గ్రామీణం: సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ రోడ్‌షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. గురువారం రోడ్‌షోతో హైదరాబాద్‌ మార్గం.. కళకళలాడింది. మూడు రంగుల జెండాను చేతబూనిన శ్రేణులు.. పెద్దసంఖ్యలో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌కు హాజరవడంతో కొత్త జోష్‌ నింపింది. పట్టణంలో కొత్త బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ప్రచార ఊరేగింపు మోడ్రన్‌ బస్టాండ్‌ వరకు కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి సారి పట్టణానికి రావడంతో పెద్దఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. అక్కడక్కడ సినిమా డైలాగులను ప్రత్యర్థులకు అన్వయిస్తూ సీఎం తనదైన శైలిలో ప్రసంగించి  . యువతను కేరింతలు కొట్టించారు. తరచూ గాడిద గుడ్డు నమూనాను చూపుతూ మాట్లాడారు. పలువురు కార్యకర్తలు గాడిదగుడ్డును ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. ఆరు నూరైనా.. అక్కడి సూరీడు ఇక్కడ ఉదయించినా పర్వాలేదు కానీ మెదక్‌ గడ్డమీద కాంగ్రెస్‌ మూడు రంగుల జెండా ఎగురవేయాలని, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను మొదటిసారిగా సిద్దిపేటకు వచ్చానంటూ వ్యాఖ్యానించారు. ఒక్కో కార్యకర్త వందమందితో సమానమని,  ప్రత్యర్థులు వంద మంది ఒకేసారి వచ్చినా తమ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తేజం నింపారు.  ఎంతోమంది కాంగ్రెస్‌ శ్రేణులు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా పని చేస్తున్నారని, ప్రాణాలు త్యజించినా జెండాలు వదలని వేలాది కార్యకర్తలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. మిత్రులారా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన జై కాంగ్రెస్‌ అంటూ ముగించారు.

సైనికుడిలా పనిచేస్తా..: నీలం మధు

రోడ్‌షోలో ప్రజలకు వందనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీలం మధు. చిత్రంలో మంత్రి కొండా సురేఖ, ఆచార్య కోదండరాం తదితరులు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అభ్యర్థి నీలం మధు అన్నారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అందుబాటులో ఉండరని, తనను గెలిపిస్తే సైనికుడిలా పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్‌, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,   అద్దంకి దయాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మహేందర్‌రావు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిపై పూలు చల్లుతున్న అభిమానులు

ముఖ్యమంత్రి కార్నర్‌ మీటింగ్‌ పదనిసలు

  • కలెక్టరేట్‌ వద్ద హెలిప్యాడ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 5.56 గంటలకు దిగారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆయనకు స్వాగతం పలికారు.
  • అక్కడే కాసేపు క్యారవాన్‌లో స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో ముఖ్యమంత్రి చర్చించారు.
  • సీఎం రాక కోసం ప్రజలు గంటల తరబడి వేచి చూశారు. 
  • హెలిప్యాడ్‌ నుంచి కాన్వాయ్‌లో 6.25కు ఎక్స్‌ప్రెస్‌ బస్టాండ్‌కు చేరుకోగా పార్టీ శ్రేణులు గజమాలతో సన్మానించారు. రేవంత్‌రెడ్డికి ఆయన చిత్రాన్నే బహుకరించారు. 
  • అక్కడి నుంచి రోడ్డుషోగా మోడ్రన్‌ బస్టాండ్‌ వద్దకు 6.55కు చేరుకున్నారు. 
  • సిద్దిపేటకు సీఎం తొలిసారి రావటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది.
  • పలు కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
  • పోలీసులు పట్టణంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై వాహనాలను తీయించారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను దారి మళ్లించారు.
  • ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్‌ దాసరి రాజు ఆధ్వర్యంలో గాడిద గుడ్డు ప్లకార్డులు ప్రదర్శించారు. 
  • రోడ్డుషో ఆద్యంతం భవనాలపై నుంచి ప్రజలు ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. 
  • అంబేడ్కర్‌ చమాన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ప్రజలపై పడింది. ఎవరికీ గాయాలు కాలేదు.

ఊరేగింపుగా వస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు


అసమానతలను రూపుమాపేందుకు ఐదు సూత్రాలు

ప్రధాని మోదీ గ్యాస్‌ ధరలు పెంచితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి గ్యాస్‌ ధరలను తగ్గించి మహిళలకు ఆర్థిక రుణభారం నుంచి విముక్తి కల్పించారని ఆచార్య కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజల్లో అసమానతలు పెంచిందని, డబ్బు ఉన్నవారికే దోచిపెట్టిందని ఆరోపించారు. ఈ దుస్థితిని రూపుమాపేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఐదు న్యాయ సూత్రాలను రూపొందించిందన్నారు. దిల్లీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.  

ఆచార్య కోదండరాం.


హరీశ్‌రావుకు ఇక నిద్ర ఉండదు: మంత్రి కొండా సురేఖ

సిద్దిపేట నియోజకవర్గంలో ఎదురు లేదనుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఇక నిద్రపోయే పరిస్థితి లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. సిద్దిపేట పట్టణంలో గురువారం రాత్రి మెదక్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె ప్రసంగించారు. సిద్దిపేట ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, బీసీ బిడ్డ మధును గెలిపించుకోవడం ద్వారా బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని