logo

ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ మనుచౌదరి పిలుపునిచ్చారు.

Updated : 03 May 2024 05:54 IST

సీడీలు ఆవిష్కరిస్తున్న మనుచౌదరి, జయదేవ్‌ ఆర్య, రచయిత విశ్వేశ్వర్‌రావు

సిద్దిపేట టౌన్‌, దుబ్బాక, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ మనుచౌదరి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఓటు వేయటం ఎలా... ఎన్నికల సమయంలో అవినీతి పద్ధతులను నిరోధించడానికి ఎన్నికల యంత్రాంగానికి ఎలా సహాయం చేయాలి లాంటి కార్యకలాపాలు స్వీప్‌ చేస్తుందన్నారు. అందులో భాగంగానే గురువారం ఓ గీతాన్ని ఆవిష్కరించారు. ఓటరు చైతన్యంపై గజ్వేల్‌ పట్టణానికి చెందిన రాయరావు విశ్వేశ్వర్‌రావు స్వయంగా రచించి స్వరపరిచిన ‘ఓటు వేయ్‌’ అనే గీతాన్ని సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మనుచౌదరి ఆవిష్కరించారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో ఈ గీతాన్ని విస్తృతం చేయాలన్నారు.

ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన 2,498 అదనపు ఈవీఎంలను రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ యాదృచ్ఛికీకరణ నిర్వహించి కేటాయించారు. దుబ్బాక లచ్చపేట ఆదర్శ పాఠశాలలో పీవో, ఏపీవోలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి గరిమ అగ్రవాల్‌ పరిశీలించి మాట్లాడారు.

నిష్పక్షపాతంగా..: సమీర్‌ మాధవ్‌ కుర్కోటి

మెదక్‌: పోలింగ్‌ రోజున స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్‌ జరగడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్‌ మాధవ్‌ కుర్కోటి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సూక్ష్మ పరిశీలకులు, సెక్షన్‌ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి నుంచి ఓటు వేయడం, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

గట్టి భద్రత: జిల్లాలోని రెండు సెగ్మెంట్ల నిర్వహణకు కంట్రోల్‌, బ్యాలెట్‌ యూనిట్లను 25శాతం, వీవీప్యాట్‌లను 40శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్‌ మాధవ్‌ కుర్కోటి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.అనంతరం కేంద్రం సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితేష్‌వ్యాస్‌ నిర్వహించిన దూరదృశ్య సమీక్షలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

గజ్వేల్‌: మెదక్‌ లోకసభ నియోజకవర్గ సాధారణ పర్యవేక్షకుడు సమీర్‌ మాధవ్‌ కుర్కోటి గజ్వేల్‌లో పర్యటించి సమీక్షించారు. ఏఆర్‌వో బన్సీలాల్‌ ఉన్నారు. 3 నుంచి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు వేయవచ్చని కలెక్టర్‌ మనుచౌదరి వెల్లడించారు. ఇతర నియోజకవర్గాల ఉద్యోగ ఓటర్లు 4 నుంచి వినియోగించుకోవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని