logo

లోక్‌సభ పోరు.. మరింత హోరు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

Published : 03 May 2024 01:35 IST

నాలుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

ఈనాడు, కామారెడ్డి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నాలుగింటిపై భారాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రభావం చూపే సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. వీటితో పాటు ఇప్పటి వరకు ప్రచారంలో వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో అగ్రనేతలను రప్పించి సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.  

మెజారిటీ సాధించేలా..

జహీరాబాద్‌, అందోలు, కామారెడ్డి, నారాయణఖేడ్‌లలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి విడతలో అందోలు నియోజకవర్గంలోని అల్లాదుర్గం సమీపంలోని ఐబీ చౌరస్తా వద్ద భాజపా ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించింది. కాంగ్రెస్‌ పార్టీ నారాయణఖేడ్‌లోని పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనజాతర సభను నిర్వహించిన విషయం తెలిసిందే. భారాస జహీరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు రోడ్‌షోను నిర్వహించింది. రెండో విడతలో భారాస ఈ నెల 7న కామారెడ్డిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్‌షో నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రేవంత్‌రెడ్డిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నారు.

సామాజికవర్గాల మద్దతుకు సమ్మేళనాలు

లోక్‌సభ నియోజకవర్గంలో ప్రభావితం చూపనున్న లింగాయత్‌, మైనార్టీలతో పాటు ముదిరాజ్‌, మున్నూరు కాపు సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాలకు చెందిన పెద్దలతో మంతనాలు జరుపుతూ సహకరించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని