logo

ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్‌కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 

Published : 03 May 2024 01:37 IST

స్వతంత్రుల గుర్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన

న్యూస్‌టుడే-మెదక్‌: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్‌కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.  పార్టీ గుర్తును చూపుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అత్యధిక మంది ఎన్నికల బరిలో ఉండడంతో ప్రధాన పార్టీలకు గుర్తుల గుబులు పుడుతోంది. మూడు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేయనుండటంతో ఓటరు వేలి చూపు ఎటువైపు వెళ్తుందోననే ఆందోళన వారిలో నెలకొంది. అంతేకాకుండా ప్రధాన పార్టీలకు చెందిన గుర్తులను పోలినవి కొందరికి కేటాయించడంతో ఓట్లు చీలే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానం నుంచి 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుర్తింపు, రిజిస్టర్‌ పార్టీలకు చెందిన వారు 15 మంది ఉండగా, మిగిలిన 29 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. వీరికి నామినేషన్ల ఉపసంహరణ రోజున గుర్తులు కేటాయించారు. ఓటు వేసేందుకు మూడు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గంలో సమాజ్‌వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి రెవెల్లి వినయ్‌సాగర్‌కు 6,947 ఓట్లు రాగా, భాజపా అభ్యర్థి ఆకుల రాజయ్యకు 6,321 ఓట్లు వచ్చాయి. వినయ్‌ సాగర్‌కు రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయించడంతో ఆ స్థాయిలో ఓట్లు పడ్డాయి. కారును పోలిన ట్రక్కు గుర్తుపై అప్పట్లో భారాస నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అదే గుర్తుకు దగ్గరగా ఉన్న చపాతి రోలర్‌ గుర్తును అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ అభ్యర్థి నంద కిషోర్‌కు, రోడ్‌ రోలర్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలంకు కేటాయించారు.

29 మంది: మెదక్‌ లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న వారు కేవలం ముగ్గురే. మిగిలిన 41 మంది అభ్యర్థులు రిజిస్టర్డ్‌, చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులే కావడం గమనార్హం. 2009 ఎంపీ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థికి 34,476, మరో అభ్యర్థికి 18,457, మరో స్వతంత్ర అభ్యర్థికి 12,099 ఓట్లు రాగా, 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి 33,057 ఓట్లు రావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి 18,183 ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో 29 మంది స్వతంత్రులు ఉండడంతో ఓట్లు చీలుతాయని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో తలా కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంది.

చిహ్నాలపై ఫోకస్‌..

ఈ ఎన్నికల్లో మూడు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఓటు వేయాలనుకునే అభ్యర్థి గుర్తు ఎక్కడుందో తెలియక ఆందోళన చెంది, కొంత మంది వృద్ధులు, నిరక్షరాస్యులు ఇతర గుర్తులకు ఓటు వేసే ప్రమాదం ఉందని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో నమూనా ఈవీఎంలతో ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉండడంతో ఆయా పార్టీలకు చెందిన శ్రేణులు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా గుర్తు గురించి వివరిస్తున్నారు. ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులు సైతం గుర్తులను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని