logo

అందని ద్రాక్ష ‘ఎమ్మెల్యే’!

అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్ఠానాన్ని మెప్పించి, ఒప్పించి పార్టీ టిక్కెట్లు ఇప్పించటం మొదలు, ప్రచారాన్ని భుజానికి ఎత్తుకొని వారిని గెలిపించి అసెంబ్లీకి పంపే వరకు కీలక పాత్ర పోషించిన గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొందరు నాయకులు ఇప్పటివరకూ శాసనసభలో అడుగు పెట్టలేదు.

Published : 26 Oct 2023 01:44 IST

గజ్వేల్‌, న్యూస్‌టుడే: అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్ఠానాన్ని మెప్పించి, ఒప్పించి పార్టీ టిక్కెట్లు ఇప్పించటం మొదలు, ప్రచారాన్ని భుజానికి ఎత్తుకొని వారిని గెలిపించి అసెంబ్లీకి పంపే వరకు కీలక పాత్ర పోషించిన గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొందరు నాయకులు ఇప్పటివరకూ శాసనసభలో అడుగు పెట్టలేదు. వారు జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ మణికొండ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ మాదాటి రంగారెడ్డి. 1952లో ఏర్పాటైన గజ్వేల్‌ నియోజకవర్గం 1962లో ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలకు ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన అభ్యర్థులను ఎంపిక చేసి వారిని గెలిపిస్తూ వచ్చారు. 1962లో కాంగ్రెస్‌ పార్టీ గజ్వేల్‌ అభ్యర్థిగా జి.వెంకటస్వామిని ఖరారు చేయగా స్థానిక నేత మాదాటి రంగారెడ్డి తన వద్ద పనిచేసే గజ్వేల్‌ సైదయ్యను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలిపి సఫలమయ్యారు. అనంతరం సైదయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకున్న తరువాత 1983 వరకు వరుసగా గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సైదయ్య విజయానికి కృషి చేసిన రంగారెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. తెదేపా నేతగా ఉన్న మణికొండ లక్ష్మికాంతరావు 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గజ్వేల్‌ నుంచి పోటీకి దిగిన అల్లం సాయిలు విజయానికి కృషి చేశారు. తరువాత 1985, 1999లో సంజీవరావు, 1994లో విజయరామారావు గెలుపునకు కృషి చేశారు. 2009లో గజ్వేల్‌ జనరల్‌ స్థానంగా మారటంతో తెదేపా అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్‌ రాకపోవడంతో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తన అనుచరుడు జి.ఎలక్షన్‌రెడ్డిని గజ్వేల్‌ స్థానం నుంచి ప్రజారాజ్యం తరఫున బరిలోకి దింపటంతో తెదేపా ఓట్లు చీలి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి దోహదం చేశాయి. తరువాత వీరిద్దరూ భారాసలో చేరారు. 2014, 2018లో కేసీఆర్‌ రెండు సార్లు గజ్వేల్‌ నుంచి విజయం సాధించటానికి కృషి చేశారు. వీరికి ఎమ్మెల్యే పదవి అందని ద్రాక్ష అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని