logo

కళ్లెదుటే కవలలు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి

భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. కవలలైన ఇద్దరు కుమారులను సర్వస్వం అనుకుంటూ జీవనం సాగిస్తుంది.. ఇంతలో దీపావళి పండగకు పిల్లలకు బాణసంచా కొనిచ్చేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లగా..

Updated : 14 Nov 2023 09:38 IST

పిల్లలతో అన్నపూర్ణ

మెదక్‌, టేక్మాల్‌, న్యూస్‌టుడే: భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. కవలలైన ఇద్దరు కుమారులను సర్వస్వం అనుకుంటూ జీవనం సాగిస్తుంది.. ఇంతలో దీపావళి పండగకు పిల్లలకు బాణసంచా కొనిచ్చేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లగా.. టిప్పర్‌ ఢీకొని కుమారులు మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆదివారం మెదక్‌లో చోటుచేసుకుంది. మెదక్‌ పట్టణ సీఐ వెంకట్‌ తెలిపిన వివరాలు.. టేక్మాల్‌ మండలం కాదలూర్‌కు చెందిన బేగరి రాములుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీనివాస్‌కు అన్నపూర్ణతో వివాహం జరగ్గా.. వీరికి  పృధ్వీతేజ్‌ (12), ప్రణీత్‌ తేజ్‌ (12) కవల పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్‌ మెదక్‌లో డీఎస్పీ వద్ద హోంగార్డుగా పని చేసేవాడు. అన్నపూర్ణ మెదక్‌లోని కస్తూర్బా పాఠశాలలో 2018 నుంచి ఒప్పంద పద్ధతిన జీవశాస్త్రం బోధకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం అన్నాసాగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్‌ మృతి చెందాడు. అప్పటి నుంచి అన్నపూర్ణ పిల్లల బాధ్యత మోస్తున్నారు. మెదక్‌లోని జంబికుంటలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. ఒక కుమారుడిని స్థానికంగా, మరొకరిని తూప్రాన్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్‌లో చదివిస్తున్నారు.

టిప్పర్‌ తలలపై నుంచి..: ఆదివారం దీపావళి పండగకని కుమారులకు బాణసంచా కొనిచ్చేందుకు అన్నపూర్ణ పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఆటోనగర్‌ వద్దకు రాగానే వెనక నుంచి టిప్పర్‌ వచ్చి ఢీకొట్టడంతో కిందపడ్డారు. కుడివైపు ఇద్దరు పిల్లలు పడిపోగా వారి తలలపై నుంచి టిప్పర్‌ వెళ్లడంతో నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందారు. తల్లి అన్నపూర్ణ ఎడమ వైపు పడటంతో ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరగ్గానే టిప్పర్‌ డ్రైవరు పరారయ్యాడు. రెండేళ్ల క్రితం భర్తను రోడ్డు ప్రమాదం బలితీసుకోగా, అలాంటి రోడ్డు ప్రమాదంలోనే ఇద్దరు కుమారులను కోల్పోవడంతో ఆమె ఒంటరిగా మిగిలారు. కళ్లెదుట కుమారుల మృతిని చూసిన అన్నపూర్ణ కోమాలోకి వెళ్లారు. మెదక్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం సోమవారం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాదలూర్‌లో పిల్లలిద్దరికీ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.

మరో ఘటనలో..: పేట్‌బషీరాబాద్‌: టపాసుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్‌ దుర్మరణం చెందాడు. పేట్‌బషీరాబాద్‌ ఎస్‌ఐ ధర్మేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌కు చెందిన పి.మహేశ్‌(30) స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి తెలిసిన వారు బోయిన్‌పల్లిలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. వారి వద్ద టపాసులు తీసుకురావడానికి ఆదివారం ఉదయం ఇంటి నుంచి బోయిన్‌పల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కండ్లకోయ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అతడు కింద పడగా.. తలపై నుంచి వెనుక చక్రం వెళ్లడంతో మృతి చెందాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని