logo

బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు

ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 29 Mar 2024 04:52 IST

ఐదుగురు సభ్యుల ముఠా రిమాండ్‌

వివరాలు వెల్లడిస్తున్న మెదక్‌ ఎస్పీ బాలస్వామి, పక్కన డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ కృష్ణ, ఎస్సై శివానందం

తూప్రాన్‌: ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తూప్రాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మెదక్‌ ఎస్పీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. గత నెల 27వ తేదీన తూప్రాన్‌కు చెందిన ఉప్పల శ్వేత 12.5 తులాల బంగారు ఆభరణాలను తన బ్యాగులో పెట్టుకుని, హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్‌స్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న సమయంలో బంగారం చోరీకి గురైంది. ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు అదేరోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూప్రాన్‌ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శివానందం ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం తూప్రాన్‌ బైపాస్‌ రోడ్డులో కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్వేత బ్యాగులోని బంగారాన్ని అపహరించినట్లుగా అంగీకరించారు. అరెస్టు చేసిన వారిలో మహారాష్ట్ర బీడ్‌ జిల్లా మజాల్‌గోన్‌ గ్రామానికి చెందిన వైశాలి విజయ్‌ సోలంకే అలియాస్‌ సునీత, హీనాకరన్‌ రహడే, జై శ్రీ అంకుల్‌ సోలంకే, విజయ్‌ భీమ్రావు సోలంకే, కరణ్‌ సంతోష్‌ రహడే ఉన్నారు. నిందితుల నుంచి 12.5 తులాల బంగారంతో పాటు, ఆరు చరవాణులు, చోరీకి వినియోగించిన కారును స్వాధీనం చేసుకుని ఐదుగురిని రిమాండ్‌కు తరలించామని ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన తూప్రాన్‌ డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ కృష్ణ, ఎస్సై శివానందాన్ని ఎస్పీ అభినందించారు. కానిస్టేబుల్‌ గోవర్ధన్‌, నాగేంద్రబాబుకు నగదు రివార్డులను అందజేశారు.

నిందితుల్లో భార్యాభర్తలు

చోరీ కేసులో నిందితుల్లో హీనాకరన్‌ రహడే, కరణ్‌ సంతోష్‌ రహడే, వైశాలి విజయ్‌ సోలంకే, భీమ్రావు సోలంకే భార్యాభర్తలు, సోలంకే దంపతులు గతంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బస్‌స్టాండ్‌లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారని ఎస్పీ తెలిపారు. బస్టాండ్లలో రద్దీగా ఉన్నచోట రెక్కీ చేపట్టి, చిన్నపిల్లలతో బస్సు ఎక్కుతున్న మహిళలను ఏమార్చి వారి బ్యాగులోని బంగారు చోరీ చేస్తుంటారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని