logo

అన్నదాతకు భరోసా

యాసంగిలో జొన్న పంట లాభాలు అందించనుంది. ఆరుతడి పంటల్లో భాగంగా అన్నదాతలు జొన్న సాగు వైపు ఆసక్తి చూపారు. ప్రస్తుతం నూర్పిళ్లు కొనసాగుతున్నాయి.

Published : 16 Apr 2024 01:31 IST

16 చోట్ల జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌]

యాసంగిలో జొన్న పంట లాభాలు అందించనుంది. ఆరుతడి పంటల్లో భాగంగా అన్నదాతలు జొన్న సాగు వైపు ఆసక్తి చూపారు. ప్రస్తుతం నూర్పిళ్లు కొనసాగుతున్నాయి. యాసంగిలో జొన్న పంట లక్ష్యానికి మించి సాగు కాగా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్‌ కసరత్తు పూర్తి చేసింది. కర్షకులకు అండగా నేటి(మంగళవారం) నుంచి జిల్లాలోని 16 చోట్ల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు దళారులను ఆక్రయించి మోసపోకుండా నిర్దేశించిన మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మూడు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో..

జిల్లాలో ప్రాథమిక సహకార సంఘం, డీసీఎంఎస్‌, వ్యవసాయ, ఐకేపీల సంయుక్త ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలు మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. ఝరాసంగం, ఏడాకులపల్లి, ఖాదీరాబాద్‌, కొండాపూర్‌, సదాశివపేట, బొక్కాస్‌గావ్‌, మనూరు, నిజాంపేట, రాయికోడ్‌, కంగ్టి, కల్హేర్‌, బాచేపల్లి, బీబీపేట, మునిపల్లి మండలం పెద్ద చెల్మడ, సంజీవరావుపేట, నాగల్‌గిద్ద కేంద్రాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు నిర్వహించనున్నారు.

పొద్దు తిరుగుడు కేంద్రం సైతం..

జిల్లాలో పొద్దు తిరుగుడు పంట 369.28 ఎకరాల్లో సాగు చేశారు. 516 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొద్దు తిరుగుడు గింజలు కొనుగోలు చేయడానికి ఇప్పటికే మనూరులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.  క్వింటాలుకు రూ.6,760 మద్దతు ధర చెల్లిస్తున్నారు.


అంచనాలకు మించి సాగు

యాసంగిలో భాగంగా జిల్లావ్యాప్తంగా 29 వేల ఎకరాల్లో జొన్న సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంచనాలకు మించి 55,616 ఎకరాల్లో సాగు చేయడం గమనార్హం. అత్యధికంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని కల్హేర్‌, నారాయణఖేడ్‌, నాగల్‌గిద్ద, మనూరు, కంగ్టి, సిర్గాపూర్‌లో జొన్న పంట వేశారు. మునిపల్లి, సదాశివపేట, ఝరాసంగం మండలాల్లోనూ సాగయింది. లక్షకుపైగా మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయపడుతున్నారు.


ఇబ్బందులు తలెత్తకుండా..

వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో జొన్న దిగుబడులు తడిసిపోకుండా ఉండేలా ప్రత్యేకంగా తాటిపత్రులు అందుబాటులో ఉంచనున్నారు. డిజిటిల్‌ కాంటాలు, గన్నీ సంచులు, రవాణాకు అవసరమయ్యే లారీలు, నిల్వలకు గోడౌన్లు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించనున్నారు. నిర్దేశించిన కాలంలోనే కర్షకులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నామని అధికారులు చెబుతున్నారు.


దళారులను ఆశ్రయించవద్దు..

- శ్రీదేవి, మార్క్‌ఫెడ్‌ డీఎం

జిల్లాలో జొన్న రైతులకు 16 చోట్ల కొనుగోలు కేంద్రాలు వినియోగంలోకి రానున్నాయి. అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. మనూరులో ఇప్పటికే పొద్దు తిరుగుడు కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మద్దతు ధర చెల్లిస్తాం. తాలు, రాళ్లు, రప్పలు లేకుండా జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని