logo

అడవిలో అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట

వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. వృక్షాలు కాలిపోవడంతో పాటు వన్యప్రాణులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటాయి.

Published : 16 Apr 2024 01:49 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. వృక్షాలు కాలిపోవడంతో పాటు వన్యప్రాణులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటాయి. ఆకులు రాలే ఈ కాలంలో చిన్న నిప్పు రాజుకున్నా అడవి అంతా వ్యాపిస్తుంది. దీనికి తోడు ఆకతాయిలు, అక్రమార్కులు అడవులకు నిప్పంటిస్తుంటారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వేసవిని దృష్టిలో పెట్టుకొని అడవుల్లో మంటలు విస్తరించకుండా ఫైర్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ల పొడవునా వీటిని ఏర్పాటు చేస్తూ అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా అగ్నిమాపక దుస్తులు అందజేశారు. ఎక్కడ మంటలు అంటుకున్నా పొగ ద్వారా ప్రమాదం ప్రాంతాన్ని శాటిలైట్‌ ద్వారా సమాచారం అధికారులకు అందుతుంది. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని నష్టాన్ని నివారిస్తారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

కొరవడిన రక్షణ

జిల్లాలోని దండకారణ్యాలు కనమరుగైపోయి ప్రస్తుతం చిట్టడవులున్నాయి. వీటికి రక్షణ లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా చాలామంది అటవీ ప్రాంతం నుంచే పొలాల వద్దకు వెళ్తుంటారు. బీడీలు, సిగరెట్లు తాగేవారు వాటిని ఆర్పకుండానే పడేస్తుండటంతో అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. పశువుల కాపర్లు, బీడీ ఆకు కోసం వెళ్లేవారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లేవారు, మేకలు, గొర్రెల పెంపకందారుల వల్ల కూడా మంటలు అంటుకుంటున్నాయి. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, పోడు పట్టాలు పొందిన వారి భూములు అడవులకు సమీపంలో ఉండటంతోనూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో లక్షా 44వేేల ఎకరాల్లో అడవులు ఉన్నాయి. ఇటీవల నర్సాపూర్‌, శివ్వంపేట, కొల్చారం, వెల్దుర్తి, తూప్రాన్‌, రామాయంపేట తదితర ప్రాంతాల్లో అడవులు ప్రమాదాల బారినపడ్డాయి.

శాటిలైట్‌తో గుర్తించి...

జిల్లాలో ప్రమాదాల నివారణకు అటవీశాఖ కిలోమీటర్ల పొడవునా ఫైర్‌లైన్లను ఏర్పాటు చేసింది. అయిదు మీటర్లు అడ్డంగా ఫైర్‌లైన్‌ ఏర్పాటు చేయడంతో మంటలు వ్యాపించకుండా చేస్తారు. అటవీ ప్రాంతాన్ని హెక్టార్ల వారీగా విభజించి వీటిని నిర్మించడం వల్ల మంటలు వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా పొగ ఆధారంగా శాటిలైట్‌తో గుర్తించి అటవీ అధికారులకు షేర్‌ చేస్తారు. దాని ఆధారంగా సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పివేస్తున్నారు.

సిబ్బందికి ప్రత్యేక దుస్తులు

అడవుల్లో మంటలు ఆర్పే సమయంలో సిబ్బందికి పొగ, దుమ్ము కళ్లు, ముక్కులోకి వెళ్లి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో వారికి ప్రత్యేక దుస్తులు అందజేశారు. కొమ్మలను చేతిలో పట్టుకొని మంటల్ని ఆర్పడానికి చేతులకు గ్లౌజ్‌లు కూడా అందజేశారు. జిల్లాలో 20వరకు ఎయిర్‌ బ్లోయర్లు అందుబాటులో ఉంచారు.


కాపాడేందుకు చర్యలు

- రవిప్రసాద్‌, జిల్లా అటవీ అధికారి

వేసవిలో అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల వల్ల ఔషధ మొక్కలు నశించిపోతాయి. విలువైన వృక్ష సంపదకు నష్టం జరుగుతోంది. జీవరాశులు అంతరించి పోతాయి. ఎవరైనా నిప్పు పెట్టినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని