logo

వలపు వలతో అసలుకే ఎసరు

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్‌’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్‌ అనూరాధ గురువారం వెల్లడించారు.

Updated : 19 Apr 2024 06:22 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్‌’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్‌ అనూరాధ గురువారం వెల్లడించారు. సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసు ఠాణా పరిధిలో ఓ వ్యక్తికి సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశను ఎరగా చూపుతూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి చరవాణికి సందేశం రాగా స్పందించాడు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాడు సూచించిన వెబ్‌సైట్‌ వివరాలు నమోదు చేసుకున్నాడు. పెట్టుబడిగా కొంత సొమ్ము చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చనే మాటలను నమ్మాడు. మొదట రూ.10 వేలు పెట్టుబడి పెట్టగా మరుసటి రోజు తిరిగి రూ.30 వేలు ఖాతాకు చేరాయి. దీంతో మూడు విడతలుగా రూ.88,403 పెట్టుబడి రూపంలో చెల్లించగా.. ఎలాంటి స్పందన లేకపోయింది. నిర్దేశించిన లింకును బ్లాక్‌ చేయగా.. మోసపోయానని గుర్తించాడు.

  • మద్దూరు పోలీసు ఠాణా పరిధిలో ఓ యువకుడికి చరవాణిలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి స్నేహ విన్నపం రాగా అంగీకరించాడు. యువతి పేరిట ఫేస్‌బుక్‌లో చాట్‌ చేసిన తదుపరి వాట్సాప్‌ నంబరును అందించాడు. వాట్సాప్‌లో సదరు యువతి నగ్నంగా వీడియోకాల్‌ చేయగా సంభాషించాడు. ఇదంతా రికార్డు చేసిన సైబర్‌ నేరగాళ్లు.. పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేస్తామని, డబ్బు పంపించకుంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడిన బాధితుడు రూ.21,500 ఆన్‌లైన్‌లో ముట్టజెప్పాడు. రెండు ఘటనల్లో బాధితులు జాతీయ సైబర్‌ విభాగం నం.1930 సంప్రదించి ఫిర్యాదు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని