logo

‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’

నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్‌రావు మోసం చేశారని మెదక్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.

Updated : 19 Apr 2024 06:24 IST

సమావేశంలో మాట్లాడుతున్న నీలం మధు, వేదికపై మైనంపల్లి హన్మంతరావు, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు

దుబ్బాక, న్యూస్‌టుడే: నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్‌రావు మోసం చేశారని మెదక్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. తనను మెదక్‌ ఎంపీగా గెలిపిస్తే, ప్రతి ఆరు నెలలకోసారి వివిధ కంపెనీలతో ఉద్యోగ మేళా నిర్వహిస్తానని చెప్పారు. గురువారం భూంపల్లిలోని వేడుక మందిరంలో నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు భూంపల్లి కేంద్రం నుంచి కాంగ్రెస్‌ నాయకులంతా ఎండ్లబండిపై ర్యాలీగా చేరుకున్నారు. నీలం మధు మాట్లాడుతూ బీసీ బిడ్డగా తనను ఆదరించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చిన ప్రజాపాలనలో గడిచిన నాలుగు నెలల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో నాలుగింటిని అమలు చేశామన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా భూనిర్వాసితుల కన్నీళ్లకు, చావులకు కారణమైన వెంకట్రామిరెడ్డిని చిత్తుగా ఓడించాలని కోరారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ చెరుకు ముత్యంరెడ్డి హయాంలో దుబ్బాకలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. పదేళ్ల కాలంలో భారాస నాయకులు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అత్యధిక మెజారిటీ వస్తే, మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దుబ్బాకకు వచ్చిన నిధులను సిద్దిపేటకు హరీశ్‌రావు తరలించుకు పోయారని నియోజకవర్గ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పలువురు కాంగ్రెస్‌లో చేరారు. మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, సిద్దిపేట నియోజకవర్గ బాధ్యుడు పూజల హరికృష్ణ, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని