logo

ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ

ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు.

Published : 19 Apr 2024 01:59 IST

శతశాతం లక్ష్య సాధన అందరి బాధ్యత

ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటరు చేతిలో తిరుగులేని ఆయుధమైన ఓటు సద్వినియోగంతోనే సమర్థ నేతను ఎన్నుకోవచ్చు. ఓటింగ్‌ రోజు గడపదాటి ఓటేస్తేనే వ్యవస్థను గౌరవించినట్లు లెక్క. అభ్యర్థి నచ్చని పక్షంలో ‘నోటా’ సైతం ఈవీఎంలో పొందుపర్చి ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం కొంత మెరుగ్గా ఉంటున్నా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. వాటితో పోలిస్తే 10 -15 శాతం తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. దివ్యాంగులు, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారెంతో మంది పోలింగ్‌ కేంద్రానికి వస్తున్నారు. మిగతావారూ వీరి స్ఫూర్తిగా కదలాల్సిన ఆవశ్యకత ఉంది.

న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌


మార్పు వస్తేనే..

మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికలనగానే.. తమకు సంబంధించినవి కావనే ధోరణిలో కొందరు, వరుసగా సెలవులు కలిసొస్తే యాత్రలకు వెళ్తున్న వారూ ఉన్నారు. పట్టణవాసులు ఆనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో మార్పు రావాలి.


చైతన్య కార్యక్రమాలతో..

ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్‌ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు చేపట్టారు. మరోవైపు డిగ్రీ, పీజీ విద్యార్థులతో ప్లాష్‌మ్యాబ్‌, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలోనూ సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు కొనసాగించనుంది. అధికార యంత్రాంగం మరింత దృష్టిసారించి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ పోలింగ్‌ కేంద్రాల వైపు నడిపించాలి.


ఆయా  జిల్లాల్లో..

  • సంగారెడ్డి జిల్లాలో గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటేసింది 67.56 శాతం మంది మాత్రమే. వందలో 33 మంది పోలింగ్‌ కేంద్రానికి రాలేదు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 63.21 శాతమే ఓటేయడం గమనార్హం. 2018 శాసనసభ ఎన్నికలతో పోల్చితే 2023 ఎన్నికల్లో పోలింగ్‌ 5 శాతం మేర తగ్గింది. 
  • మెదక్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో 2014 నుంచి ఇటీవల జరిగి ఎన్నికల వరకు పోలింగ్‌ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అదే పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం భిన్నమైన గణాంకాలు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 13.04 శాతం తగ్గింది. 
  • సిద్దిపేట జిల్లాలో ఇదేతరహాలో నమోదైంది. 2018 ఎన్నికల్లో 84 శాతం మంది మేర ఓటేయగా..  2023లో ఒక శాతానికి పైగా తగ్గింది. అదే గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 72 శాతం నమోదైంది.

అందరినీ నడిపిద్దాం..: నరేందర్‌, మిరుదొడ్డి

సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నా. గతేడాది ఆగస్టులో ఓటు హక్కు వచ్చింది. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటేశాను. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ హక్కును సద్వినియోగం చేసుకుంటా. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తమ బాధ్యతను నిర్వర్తించాలి. భవితను దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి. ఐదేళ్లలో మంచి చేస్తారనే నమ్మకం కలిగిన నేతను ఎన్నుకోవాలి. తోటివారిని సైతం పోలింగ్‌ కేంద్రానికి నడిపిద్దాం.


ఓటు విలువ ఎనలేనిది

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. సమర్థుల ఎన్నికకు దీన్ని ఉపయోగించాలి. పల్లెలతో పోలిస్తే పట్టణవాసులు ఎక్కువ మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఓటరు చైతన్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అర్హులందరూ ఓటరుగా నమోదయ్యేలా చూశాం. వారంతా పోలింగ్‌లో పాల్గొనేలా చైతన్యానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్వీప్‌ ఆధ్వర్యంలో ఊరూరా అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాం. ఇప్పటికే కార్యక్రమాలు షురూ చేశాం. పోలింగ్‌ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులు బాధ్యతగా హక్కు వినియోగించుకోవాలి.

వల్లూరు క్రాంతి, కలెక్టర్‌, సంగారెడ్డి



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని