logo

పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా

ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్‌ లోక్‌సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత,

Published : 19 Apr 2024 02:14 IST

ప్రధాని, సీఎంను అందించిన పార్లమెంటు నియోజకవర్గం

న్యూస్‌టుడే-మెదక్‌: ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్‌ లోక్‌సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, కొమురవెల్లి మల్లన్న ఆలయాలు వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్న నియోజకవర్గం ఎందరో రాజకీయ ఉద్ధండులను అందించింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే అవకాశం మెతుకుసీమ ప్రజలు కల్పించారు. ఈ క్రమంలో మరోమారు లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం...

18 సార్లు ఎన్నికలు...

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. వాస్తవంగా 17 సార్లు జరగాల్సి ఉండగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్‌ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ రావడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక మండలం పోతారానికి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు.  

ప్రధానిని అందించిన నేల....

దేశానికి ప్రధానిని అందించిన ఘనత మెతుకుసీమకు దిక్కింది. 1980లో మధ్యంతర ఎన్నికలు రావడంతో ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. 3,15,077 ఓట్లు వచ్చాయి. ఆమె మెదక్‌ ఎంపీగా ఉండి ప్రధాని పదవిలో కొనసాగుతుండగానే 1984 అక్టోబర్‌ 31న మరణించారు.

హస్తం అత్యధిక సార్లు...

మెదక్‌ లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక సార్లు గెలుపొందింది. ఉపఎన్నికతో కలుపుకొని 18 సార్లు ఎన్నికలు జరగ్గా.. పీడీఎఫ్‌, టీపీఎస్‌, భాజపా, తెదేపాలకు ఒకే ఒకసారి అవకాశం దక్కింది. కాంగ్రెస్‌ అభ్యర్థులు తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వీరిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బాగారెడ్డి అత్యధిక సార్లు ఎన్నికకావడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈయన 1989లో గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆలె నరేంద్ర, మల్లికార్జున్‌, హన్మంతరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి రెండేసి సార్లు  ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి వరుసగా భారాస జయకేతనం ఎగరవేస్తూ వచ్చింది.


మారిన స్వరూపం..

మొదట్లో మెదక్‌, అందోలు, సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధితో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్వరూపం మారింది. దీని పరిధిలోకి ప్రస్తుతమున్న సంగారెడ్డి, పటాన్‌చెరు, సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, మెదక్‌, నర్సాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లు చేరాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని