logo

వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు.

Published : 24 Apr 2024 03:13 IST

ఆటలాడుతున్న విద్యార్థులు
న్యూస్‌టుడే, చేగుంట: క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. ఖాళీగా ఉండటంతో వారి ఆలోచనలో మార్పు వస్తుంది. అలాంటి వాటి నుంచి విముక్తి కలిగించేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఎంతో మేలు చేస్తుంటాయి. జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.

జిల్లాలో పది చోట్ల : జిల్లాలో పది చోట్ల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి. నెల రోజుల పాటు శిక్షకులకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తారు. ఇలా జిల్లాలో మొత్తం పది శిబిరాలకు రూ.40 వేలు వెచ్చిస్తారు. క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానాల అభివృద్ధి, విద్యార్థులకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలకు రూ.10వేలు, క్రీడల సమయంలో ఏదైనా ప్రమాదం జరగటం, గాయపడితే ప్రథమ చికిత్స అందించేందుకు రూ.5 వేల నిధులు కూడా కేటాయించారు. ఇలా ప్రతి జిల్లాకు రూ.1.05 లక్షలు ఖర్చు చేయనున్నారు.  

 వివిధ క్రీడాంశాలు: వాలీబాల్‌, ఖోఖో, సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌, టేబుల్‌టెన్నిస్‌ వంటి వాటిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎండల తీవ్రతను బట్టి ఉదయం, సాయంత్రం శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఇందులో అవకాశం కల్పించనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శిబిరాలకు పంపేలా ప్రోత్సహిస్తే నెల రోజుల్లో మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంటుంది. వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఈసారి రగ్బీ, యోగా వంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. శిబిరాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులను నియమించారు.  

 ఎక్కడెక్కడ నిర్వహణ:బూర్గుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వాలీబాల్‌, శాలిపేటలో ఖోఖో, కొడపాకలో వాలీబాల్‌, తూప్రాన్‌ క్రీడా ప్రాంగణంలో సాఫ్ట్‌బాల్‌, కొంతాల్‌పల్లిలో వాలీబాల్‌, మనోహరాబాద్‌లో బేస్‌బాల్‌, యూసూఫ్‌పేటలో కబడ్డీ, రామాయంపేటలో ఫుట్‌బాల్‌, వడియారంలో వాలీబాల్‌, మెదక్‌ గుల్షన్‌క్లబ్‌లో టేబుల్‌టెన్నిస్‌ నిర్వహించనున్నారు.
మంచి అవకాశం: వేసవిలో నిర్వహించే క్రీడా శిబిరాల వల్ల విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుంది. ప్రతి రోజు ఆటల్లో శిక్షణ తీసుకోవడం వల్ల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటి వద్దనే ఉండకుండా కాస్తా ఉపశమనం పొందేందుకు వీలు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడా శిబిరాలకు పంపితే బాగుంటుంది. స్థానికంగానే వారు సాధన చేసేందుకు అవకాశం ఉంది.
నాగరాజు, డీవైఎస్‌వో

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని