logo

మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య

డబ్బుల విషయంలో కోహీర్‌లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం,

Updated : 25 Apr 2024 06:33 IST

ఇద్దరు నిందితుల రిమాండ్‌

 వివరాలు వెల్లడిస్తున్న జహీరాబాద్‌ సీఐ రవి

 న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌, కోహీర్‌: డబ్బుల విషయంలో కోహీర్‌లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, లేదంటే, ఎలా బతుకుతారో అంటూ యువకులను భయపెట్టి దాడి చేయడంతో ఈ  ఘాతుకానికి పాల్పడ్డారు. జహీరాబాద్‌ పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం సీఐ రాజబోయిన రవి తెలిపిన ప్రకారం హత్యకు గురైన హైదరాబాద్‌లోని ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన షేఖ్‌ అన్వర్‌అలీ అలియాస్‌ హనీసింగ్‌(30), కోహీర్‌ మండలం రాజనెల్లికి చెందిన ముస్తఖీమ్‌(22), కోహీర్‌ నల్సావాడికి చెందిన మహ్మద్‌ కైౖఫ్‌(24) కొంతకాలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఆటోడ్రైవర్లు కలిసి పనిచేశారు. ముస్తఖీమ్‌, మహ్మద్‌ కైౖఫ్‌లకు షేఖ్‌ అన్వర్‌అలీ తన మామా వద్ద ఆటోలను అద్దెకు ఇప్పించేవాడు. అద్దె రూ.1000 వసూలు చేసి రూ.600 యజమానికి ఇచ్చి రూ.400 కమీషన్‌ తీసుకునేవాడు. దీంతో పాటు దుర్భాషలాడుతూ రాత్రి వేళల్లో వారిని చోరీలకు తీసుకెళ్లేవాడు. అన్వర్‌అలీ ప్రవర్తన నచ్చకపోవడంతో ముస్తఖీమ్‌, మహ్మద్‌ కైౖఫ్‌ సొంతూళ్లకు వచ్చి ఆటోడ్రైవర్‌లుగా జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే అన్వర్‌ తరుచూ ఫోన్‌ చేసి మళ్లీ హైదరాబాద్‌ వచ్చేయండి చోరీలు చేద్దాం. లేదంటే ఆటో అద్దె బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తు వచ్చాడు. జహీరాబాద్‌కు వస్తా నాలుగు ద్విచక్ర వాహనాలు అపహరించి ఇవ్వాలని షరతూ విధించాడు. లేదంటే మీ అంతు చూస్తానని బెదిరించాడు. హైదరాబాద్‌ నుంచి కోహీర్‌ వచ్చిన అలీతో మంగళవారం రాత్రి ప్రభుత్వ పాఠశాల వెనక కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరిగింది. వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ముస్తఖీమ్‌పై అన్వర్‌అలీ దాడికి యత్నించగా, ముస్తఖీమ్‌, కైఫ్‌ కలిసి ఎదురుదాడి చేసి అతన్ని అంతమొందించారు. అదే రోజు నిందితుల్లో ఒకరు ఠాణాలో లొంగిపోయాడు. మరొకరిని బుధవారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని త్వరగా పట్టుకుని రిమాండ్‌కు తరలించడంలో కృషి చేసిన ఎస్సై విఠల్‌, సిబ్బంది శ్రీనివాస్‌, సుధాకర్‌ను సీఐ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు