logo

బరిలో 44 మంది 15 మంది

మెదక్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు.

Updated : 30 Apr 2024 06:42 IST

గుర్తింపు, రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు
 29 మంది స్వతంత్రులు

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు తలపడుతున్న నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే మెదక్‌ ద్వితీయ స్థానంలో ఉంది. ఇందులో గుర్తింపు, రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్రులు ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గానికి మొత్తం 54 మంది నామినేషన్‌ దాఖలు చేయగా, అందులో ఒక స్వతంత్ర అభ్యర్థి నామపత్రం తిరస్కరించిన సంగతి విధితమే. నామపత్రాల ఉపసంహరణకు సోమవారం తుది గడువు కాగా, మధ్యాహ్నం మూడు గంటలలోపు తెలంగాణ రాజ్య సమితి పార్టీ అభ్యర్థి తుపాకుల మురళీ, యుగ తులసీ పార్టీ అభ్యర్థి అనిల్‌, స్వతంత్ర అభ్యర్థులు బద్రేశ్‌, పృధ్వీరాజ్‌, బంగారయ్య, వరికోలు శ్రీనివాస్‌, మల్లికార్జున్‌, గానగోని శ్రీనివాస్‌, మంతురి బాబు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది పోరులో 44 మంది అభ్యర్థులు నిలిచారు.

స్వతంత్రులే అధికం..

ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ స్థానానికి పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ చేస్తుండడం గమనార్హం. మొత్తం 29 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. కుమార్‌, అభిలాష్‌ చెలిమెల, అభిలాష్‌ శిర్న, ఆంజనేయులు, క్రాంతికుమార్‌, కాసోజు శ్రీకాంత్‌, కొండి అశోక్‌, కొల్కూర్‌ ప్రతాప్‌, గడీల ఆంజనేయులు, భుజంగం, గౌటి మల్లేశ్‌, వీర్‌సంగప్ప, రాజేందర్‌, భానుచందర్‌ దాసరి, దుబ్బాల శ్రీశైలం, నరహరి, నవీన్‌కుమార్‌, నాగమణి, ప్రదీప్‌, విజయ్‌కుమార్‌, లక్ష్మినారాయణ, అజార్‌, మేడి శ్రీనివాస్‌రెడ్డి, రఘు, రాజేశ్‌ సాగర్‌, లక్ష్మినారాయణ, రమేశ్‌, వెంకటేశ్‌, సత్యనారాయణగౌడ్‌ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. వీరికి రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌రాజ్‌ ఎన్నికల గుర్తులను కేటాయించారు.

జహీరాబాద్‌లో 19 మంది..

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించగా.. 40 మంది 68 సెట్లు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియలో 14 మందికి చెందిన 19 సెట్లు తిరస్కరించారు. 26 మంది అభ్యర్థుల నామపత్రాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. బరిలో ఉన్న వారిలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆరుగురు, మిగతా పది మంది స్వతంత్రులు. అభ్యర్థుల సంఖ్య 15 దాటడంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు.

మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం...

అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్‌ రోజున ఓటు వేసేందుకు మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం అవుతాయి. ఒక బ్యాలెట్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లు, ఫొటో, పార్టీ పేరు, గుర్తు వివరాలు ఉంటాయి. కానీ మెదక్‌ స్థానంలో 44 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం. పార్లమెంట్‌ నియోజకవర్గంలో 2,124 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్‌ కోసం 6,372 బ్యాలెట్‌ యూనిట్లు అవసరం. పోలింగ్‌ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 శాతం అదనంగా బ్యాలెట్‌ యూనిట్లను అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 6,372 బ్యాలెట్‌ యూనిట్లకు అదనంగా 1,593 సమకూర్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని