logo

సంతోషాల సవ్వడి.. ఐదు వసంతాల ఒరవడి

‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా..

Published : 05 May 2024 01:34 IST

నేడు నవ్వుల దినోత్సవం

న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌ కలెక్టరేట్‌: ‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా.. సునాయాసంగా సాగాలంటే నవ్వు అనివార్యం. ఎన్నో సమస్యలకు ఇదో టానిక్‌గా ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనికి ప్రతిబింబిమే ఆనందం, సంతోషం. ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ.. మెరుగైన పాలన అందిస్తే అందరి మోముల్లో నవ్వులు విరబూయించడం సుసాధ్యమే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం పురస్కరించుకొని ఎన్నికయ్యే నేత అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివిరిసేలా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకతపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సిద్దిపేటలోని ఐటీ టవర్‌

పోలింగ్‌కు పోటెత్తాలి..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బారులు తీరి

జనం మోమున చిరునవ్వు సవ్వడి చేయాలంటే ప్రభుత్వాలదే బాధ్యత. చట్టసభలో సమర్థ నేతలను కూర్చునేబెట్టే బాధ్యత ఓటర్లపై ఉంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 80 శాతాన్ని మించి పోలింగ్‌ నమోదైంది. ఓటర్లు చక్కటి స్ఫూర్తిని చాటారు. యంత్రాంగం శతశాతం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా సాధ్యం కాలేదు. ఈసారి మరింత చైతన్యాన్ని చాటాలి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటర్లు బాధ్యతగా ఓటేస్తేనే ప్రజాస్వామ్యం చిరునవ్వు చిందిస్తుంది. ప్రలోభాలకు లొంగకుండా, ప్రజాసేవకుడిని ఎన్నుకుంటే సుపరిపాలన సాధ్యం. ఈ నెల 13న జరిగే ఓటింగ్‌ శతశాతం నమోదులో అందరూ భాగస్వాములు కావాలి.

ఆమె ఉన్నతికి బాటలు వేయాలి..

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం. గ్రామీణ, పట్టణ మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా, పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే అక్షరాస్యత పెరిగింది. ఆర్థిక స్వావలంభనకు కేంద్రం చర్యలు చేపట్టాలి. ఇందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రాయితీపై కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమివ్వాలి. జపాన్‌, చైనా ఇతర దేశాల్లో ఇళ్లలోనే ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారు చేసేలా ప్రజలను ఆయా ప్రభుత్వాలు తీర్చిదిద్దాయి. మహిళా శక్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడా ఈ విధానాలు ప్రవేశపెడితే మగువల ఆనందానికి అవధి ఉండదు.

పేదలపై పెద్దమనసుతో..

  • పేదరికం.. దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య. దీని నివారణకు కేంద్రంలో కొలువుదీరే ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. అప్పుడే పేదల మోమున చిరునవ్వు చిందుతుంది.
  • ప్రతి పేద కుటుంబానికి కనీస ఆదాయం లభించేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి.ః రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కార్పొరేట్‌ స్థాయిలో పక్కాగా అమయ్యేలా చూడాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులకు జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధుల కేటాయింపులు పెంచాలి.

యువస్వామ్యం కీలకం..

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 40 శాతానికి పైగా యువ భాగస్వామ్యం ఉంది. ఉన్నత, సాంకేతిక విద్యావంతులు భారీగానే ఉన్నా.. డిమాండ్‌కు తగ్గట్టు పరిశ్రమలు లేక నిరాశకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, ములుగు, మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌, చిన్నశంకరంపేట, చేగుంట, నర్సాపూర్‌ మండలాల్లోనే పరిశ్రమలు విస్తరించాయి. జహీరాబాద్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఉండటం కలిసొచ్చే అంశం. సిద్దిపేటలో ఐటీ టవర్‌ ఏర్పాటు కొంత ఊరటనిచ్చింది. ఎంపీగా గెలిచే నేత వీటిపై దృష్టిసారించాలి. పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపాలి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే యువతలో ఆనందం వెల్లివిరిస్తుంది.

రైతన్న రారాజుగా..

పల్లెలు.. దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి చోట సాగుకు మరింత ప్రోత్సాహం అవశ్యం. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అత్యధికులకు వ్యవసాయమే జీవనాధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందించడం కొంత ఊరటనిచ్చేదే. అయినా అకాల వర్షాలు, కరవుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. సాగుకు ఊపిరి అందేలా.. ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీటిని అందించేలా సత్వర చర్యలు చేపట్టాలి. విత్తనాలపై రాయితీలు కల్పించాలి. పంటలకు మద్దతు ధర పెంచాలి. నిర్దేశిత వ్యవధిలో బ్యాంకులు రుణాలు అందించేలా చొరవ చూపాలి. ఆయా అంశాలు సాకారమైతే.. అన్నదాతల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.

చదువుకు చేయూత..

చదువుతోనే సమాజ ప్రగతి సాధ్యం. రేపటి పౌరులకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలి. సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనం నిర్మించాలి. మెదక్‌ జిల్లాలో నవోదయతో పాటు కేంద్రీయ విద్యాలయం నెలకొల్పాలి. రెండు జిల్లాల్లో జేఎన్టీయూ/ ఓయూ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటుకు ఎమ్మెల్యేల సహకారంతో కృషి చేయాలి. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వసతుల కల్పనకు అధిక నిధులు తీసుకురావాలి. సాంకేతిక, వృత్తివిద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక ప్రకటించాలి. ఇవి సాకారమైతే విద్యార్థుల్లో చిరునవ్వు శాశ్వతం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని