logo

దుబ్బాకలో లోకల్‌ దారి

నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. ఒక్కోచోట ఒక్కో సమస్య ప్రభావితం చేస్తుంది.

Updated : 05 May 2024 06:34 IST

ప్రభావం చూపే వర్గాలపై పార్టీల ప్రత్యేక దృష్టి

న్యూస్‌టుడే, చేగుంట: నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. ఒక్కోచోట ఒక్కో సమస్య ప్రభావితం చేస్తుంది. కొన్నిచోట్ల మహిళలు ఎక్కువగా ఉంటే.. మరోచోట కార్మికులు అధికంగా ఉంటారు. మరోచోట నిర్వాసితులు ఓట్లు పడేతీరును ప్రభావితం చేస్తారు. ఈ విషయాన్ని గమనించిన పార్టీలు, అభ్యర్థులు, నాయకులు ఎక్కడికక్కడ ప్రచారంలో స్థానిక సమస్యలు, అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాము ఎలా వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యత్నిస్తామో ఓటర్లకు చెబుతున్నారు. రోడ్డుషోలలో ప్రధాన నాయకులు దేశం, రాష్ట్రం స్థాయి అంశాలు ప్రస్తావించినా.. స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారంలో మాత్రం స్థానికతకు పెద్దపీట వేస్తున్నారు.

పట్టు నిలపడానికి గట్టి యత్నం

పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రధానంగా భాజపా, కాంగ్రెస్‌, భారాస నాయకులు మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 97,879 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు 44,366 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి 24,947 ఓట్లు సాధించారు. భారాస ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ రావడంతో పట్టు నిలుపుకోవడానికి రెండు పార్టీలూ యత్నిస్తున్నాయి. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తున్నారు. నరేంద్ర మోదీ చరిష్మా భారాస, కాంగ్రెస్‌ల కంటే ముందుంచుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభావితం చేసే అంశం మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల పరిహారం. దీనిని మూడు పార్టీలు వారి శైలిలో ప్రత్యర్థి పార్టీల వారే కారణమంటూ ఆరోపించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. భాజపా నాయకులు పట్టణ ఓటర్లపై ఎక్కువగా దృష్టి పెట్టారు.

బంధుగణంతో మహిళా ఓటర్లు

భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో పాటు ఆయన బంధుగణం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వియ్యంకులు, తమ్ముళ్లు, భార్య, కుమార్తె, కుమారుడు మహిళ ఓటర్లను కలుస్తున్నారు. ఉపాధి కూలీల వద్దకు వెళ్లి తామేం చేయనున్నారో వివరిస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీల మోసపూరితమని చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం భారాస నేతలు, ప్రజాప్రతినిధులు మిగతాచోట్ల మాదిరి ఇతర పార్టీలోకి వెళ్లడం తక్కువగా ఉంది. చేగుంట, నార్సింగి, రాయపోల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేశారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మల్లన్నసాగర్‌ నిర్మాణం వల్లనే వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని వివరిస్తున్నారు.


నీలం మధు: రోడ్డుషోల్లో గ్యారంటీలు

కాంగ్రెస్‌ పార్టీ నుంచి అభ్యర్థి నీలం మధు చేగుంట, నార్సింగి, మిరుదొడ్డి, అగ్బర్‌పేట-భూంపల్లి మండలాల్లో రోడ్డుషో, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొన్నారు. చేగుంటలో మాజీ ఎమ్మెల్యే సీనియర్‌ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓట్ల సాధనలో ఎక్కడెక్కడ వెనుకబాటు ఉందో అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. భారాస నుంచి ముఖ్యనాయకులను కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్చుకున్నారు. ఆరు గ్యారంటీల అమలును ప్రజలకు వివరిస్తున్నారు.


రఘునందన్‌రావు: ఉదయపు  నడకలో కేంద్ర పథకాలపై..

భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు.. ఉదయపు నడకలో ఓటర్లను కలుస్తున్నారు. కేంద్ర పథకాలు, నరేంద్ర మోదీ సాధించిన విజయాలపై వివరిస్తున్నారు. కాంగ్రెస్‌, భారాసల వల్ల నష్టమేనని ఆరోపిస్తూ ఇంటింటి ప్రచారంలో చెబుతున్నారు. చేగుంట, దుబ్బాక, నార్సింగి, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోల్‌, అగ్బర్‌పేట-భూంపల్లి మండలాల్లో నాయకులు ఇంటింటి ప్రచారం పూర్తి చేశారు. అయోధ్య రామాలయం, 370 అధికరణ, పేదలకు బియ్యం పంపిణీ లాంటివి చేశామని ప్రచారం చేస్తున్నారు. చేగుంట మండలంలో 14 రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. వారి ఓట్లపై భరోసాతో ఉన్నారు. ఉపాధి హామీ కూలీలను కలిసి కూలీ మొత్తాన్ని రూ.300 చేశామంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని