logo

గ్యారంటీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

Published : 07 May 2024 03:54 IST

వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. వృద్ధులకు రూ.4 వేల పింఛను ఇవ్వటంలేదని.. ముఖ్యమంత్రి మాత్రం నెలకు రూ.4.50 లక్షల జీతం మాత్రం తీసుకుంటున్నారని విమర్శించారు. ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తానని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోవడం ఖాయమన్నారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిస్తే ప్రజల భూములను లాక్కుంటారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉచితంగా వాక్సిన్‌ ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదలకు మరో ఐదేళ్ల పాటు ఉచితంగా కేంద్రం రేషన్‌ బియ్యం అందిస్తుందన్నారు. తనకు ఒకసారి ఎంపీగా అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని, కేంద్రం నుంచి భారీగా నిధులు తెస్తానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మురళీయాదవ్‌, జిల్లా నాయకులు రమణారావు, శ్రీనివాస్‌గౌడ్‌, మండల ఇన్‌ఛార్జి బుజాష్‌యాదవ్‌, మండల పార్టీ అధ్యక్షుడు చంది నర్సింహులు, శేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట: భాజపా 400 సీట్లు గెలిచి మళ్లీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రఘునందన్‌ రావు అన్నారు. మాసాయిపేట భాజపా క్యాంపు కార్యాలయంలో రామాయంపేట, నిజాంపేట మండల పరిధి నార్లాపూర్‌, లక్ష్మాపూర్‌, కాట్రియాలతో పాటు పలు గ్రామాలకు చెందిన యువకులు నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు. వారికి రఘునందన్‌ రావు కండువా కప్పి ఆహ్వానించారు. నాయకులు సుధాకర్‌ రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, విజయ్‌ కుమార్‌, ఉదయ్‌ కిరణ్‌, శంకర్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని